చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
దిశ, కాప్రా : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వేల ఆధునికరణతో దేశ ముఖ చిత్రమే మారిపోతుందని ప్రధాని మోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేల్లో మౌలికసదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రయాణికులకు కావల్సిన సౌకర్యాలతో పాటు అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తీసుకొచ్చామని, నూతన రైల్వే లైన్లతో పాటు అండర్ బ్రిడ్జి నిర్మాణాల పనులను వేగవంతం చేశామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర సహాయ మంత్రులు సోమన్న, కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తుందని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నగరంలో నాలుగో టెర్మినల్ గా అభివృద్ధి చేశామని, దీంతో జంటనగరాల ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయన్నారు. అయితే అప్రోచ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చర్లపల్లి టెర్మినల్ నిర్మాణంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని, జంటనగరాల ప్రజలకు చర్లపల్లి టెర్మినల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ట్రయల్ మాత్రమేనని అసలు పండుగ ముందుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణనకు రూ. 720 కోట్లు, నాంపల్లికి రూ. 350 కోట్లు,చర్లపల్లి టెర్మినల్ కు రూ.413 కోట్లతో ఆత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్లను, విమానాశ్రయాలను తలపించేలా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.