మైసమ్మ చెరువు సమగ్ర విచారణ చేపట్టాలి
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువుల సమగ్ర విచారణకు డిమాండ్ పెరుగుతుంది.
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువుల సమగ్ర విచారణకు డిమాండ్ పెరుగుతుంది. హైడ్రా యాక్షన్‌లోకి దిగిన వెంటే అన్ని పార్టీల నాయకులు, పర్యావరణ ప్రేమికులు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులను పరిరక్షించేందుకు రావాలని, కూకట్పల్లి వైపు కన్నెతి చూడండి సార్ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ట్విట్టర్ వేదికగా సైతం విన్నవించుకుంటుండటం విశేషం.
ఈ క్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలో 2010లో నిర్వహించిన చెరువుల సర్వే, అప్పటి రికార్డులను తిరగేసి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, ప్రజలకు స్వచ్ఛమైన జలాశయాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
రెవెన్యు రికార్డుల ప్రకారం 227 ఎకరాలు
కూకట్పల్లి గ్రామం పరిధిలోని 893 ప్రభుత్వ భూమి, ప్రైవేటు సర్వే నంబర్లు 906,907,905,903,902,901,904,900,899, 898,896,892/ఏ, 892/ఏఏ, 894,895, మూసాపేట్ గ్రామం పరిధిలోని 72, 71, 70, 63, 62, 61, 60, 64, 66, 65, 59, 58, 57, 56, 50, 49, 48, 47, 46/ఏ, 46/సి, 46/డి, 46/బి, 45, 44, 43, 42, 41, 40, 92, 93, 94, 95,96,97,98,104,105,106,107,108,103, అల్లాపూర్ గ్రామం పరిధిలోని 50,51,52 సర్వే నంబర్లలోని 182.10 ఎకరాల భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉండగా సర్వే నంబర్లు 49,50, 51,52,54,56,57,64,66,69,73,74,99,102,103, 104,892 సర్వే నంబర్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు రెవెన్యు రికార్డులో నమోదై ఉంది. కూకట్పల్లి, మూసాపేట్, అల్లాపూర్ గ్రామాల మధ్య సుమారు 227 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 83 ఎకరాల వరకు మాత్రమే మిగిలి ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
279 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి : కొడిచర్ల మహేందర్, కార్పొరేటర్, మూసాపేట్ డివిజన్
మూసాపేట్, కూకట్పల్లి, అల్లాపూర్ గ్రామాల సర్వే నంబర్లతో కూడిన మైసమ్మ చెరువు 2010 రికార్డుల ప్రకారం 138.29 ఎకరాలు ప్రభుత్వ భూమి, 141.08 ఎకరాల పట్టా భూములను కలుపుకుని సుమారు 279.37 ఎకరాల విస్తీర్ణంలో మైసమ్మ చెరువు ఉండేది. ముళ్ల కత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులు గొలుసు కట్టు చెరువులు. కాముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య నిండుగా వాటర్ బాడి ఉండేది.
బడా నిర్మాణ సంస్థలకు కొమ్మ కాస్తూ అధికారులు రికార్డులను తారు మారు చేసి 2010 తరువాత మళ్లి మ్యాప్‌లను సృష్టించి పాత లెక్కలను ఎగరగొట్టారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటే నిజమైన లెక్కలు బయటికి వస్తాయి. 2010 సంవత్సరంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెరువుల సర్వే చేశారు. అంతే కాకుండా గోకుల్ సొసైటీ సమీపంలో ఉన్న అలావుద్దీన్ కుంటను పూర్తిగా రికార్డుల నుంచే తొలించిన ఘనత అధికారులది.