Hot News: ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ.. కొత్తగా రెండు జోన్లు పెంపు
హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
దిశ, మేడ్చల్ బ్యూరో: హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీపడుతూ దూసుకువెళ్లుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తన పోటీ పక్క రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక పోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది. హెచ్ఎండీఏలో కొత్త జోన్లను ఏర్పాటు చేసింది. గతంలో నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు వాటిని ఆరుకు పెంచింది.
త్రిపులార్ వరకు..
ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ ప్రాంతం 7,200 చదరపు కీలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, త్వరలోనే రిజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మొత్తం హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హెచ్ఎండీఏలో గతంలో నాలుగు జోన్లు ఉండగా, నగరవాసులకు సేవలు అందించే విషయంలో ఇబ్బందులు తలేత్తేవి. తగినంత సిబ్బంది కూడా లేకపోవడంతో అప్లికేషన్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది. తాజాగా జోన్లను విభజించడంతో పాటు అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శంషాబాద్, ఘట్‌కేసర్ జోన్లను యథాతధంగా ఉంచి, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లను రెండేసి జోన్లుగా విభజించనున్నారు.
ప్లానింగ్ ప్రక్షాళన..
ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేస్తూ గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్లు అంతకు మించి ఉన్న వారిని బదిలీ చేశారు. డిప్యూటేషన్లపై ఉన్న వారికి స్థాన చలనం కల్పించారు. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జోన్-1 ప్లానింగ్ అధికారిగా గోపిక రమ్య, మేడ్చల్ జోన్-2 ప్లానింగ్ అధికారిగా కే.శాలినిని నియమించగా, మేడ్చల్ చీఫ్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన యశ్వంత్ రావును ఘట్‌కేసర్ జోన్‌కు బదిలీ చేశారు. శంకర్‌పల్లి జోన్ పీవో యాదరిగిరావును మాస్టర్ ప్లాన్ యూనిట్‌కు బదిలీచేశారు. కొత్తగా ఏర్పడిన శంకర్‌పల్లి జోన్-1కు చీఫ్ ప్లానింగ్ అధికారి బి.ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు సీపీవో మల్లికార్జున రావును నియమించారు.
వివిధ జోన్లలో ప్రాంతాలు ఇలా..
మేడ్చల్-1
బాచుపల్లి, గుండ్ల పోచంపల్లి, నర్సాపూర్, శామీర్‌పేట, శివంపేట్, తుప్రాన్, మనోహర్‌బాద్.
మేడ్చల్-2
కొంపల్లి, మేడ్చల్, పీఎస్‌యూ గ్రిడ్ రోడ్, ఉప్పల్ భగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, ములుగు, వర్గల్, కాప్రా.
ఘట్‌కేసర్..
కీసర, భువనగిరి, బొమ్మలరామారాం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, చౌటుప్పల్, పోచంపల్లి, బీబీ నగర్, మేడిపల్లి.
శంషాబాద్..
బాలాపూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మంచాల (కొంతభాగం) మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్ నగర్, షాద్‌నగర్, కొత్తూర్, నందిగామ.
శంకర్ పల్లి -1
గండిపేట్, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్.
శంకర్‌పల్లి-2
అమీన్‌పూర్, పటాన్ చెరు, శంకర్‌పల్లి, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర్.