కళాశాలలో విద్యుదాఘాతంతో నలుగురికి గాయాలు..

గాలికి ఎగురుతున్న కళాశాలకు చెందిన ఫ్లెక్సీని సరి చేస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-03-04 11:16 GMT

దిశ, పేట్ బషీరాబాద్: గాలికి ఎగురుతున్న కళాశాలకు చెందిన ఫ్లెక్సీని సరి చేస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కొంపల్లి సినీ ప్లానెట్ ఎన్సీఎల్ నార్త్ రోడ్డులో సాయి చైతన్య జూనియర్ కళాశాల ఉంది. సర్వీస్ రోడ్డులో రహదారి వెంబడి ఉన్న ఈ కళాశాల భవనానికి పక్కనుంచి లెవెన్ కేవీ విద్యుత్ తీగల స్తంభాలు ఉన్నాయి. అయితే గురువారం మధ్యాహ్న సమయంలో కళాశాల సిబ్బంది విజయ్, ఉపేందర్, లక్ష్మణ్ లు కళాశాలకు చెందిన ఫ్లెక్సీ ఊడిపోతే దాన్ని సరి చేస్తున్నారు. అయితే వారికి మరో వ్యక్తి సహాయం అవసరం అయి కళాశాల భవనంపై నివాసం ఉంటున్న డ్రైవర్ క్రాంతిని పిలిచారు.

క్రాంతి వీరికి ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో సహాయం చేస్తుండగా ఒక్కసారిగా గాలి బాగా వీచింది. దీంతో ఫ్లెక్సీ ఎగురుకుంటూ వెళ్లి భవనానికి సమీపం నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలను తాకింది. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటు పనిలో ఉన్న నలుగురు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ గా పనిచేస్తున్న క్రాంతికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కళాశాల యాజమాన్యం బాధితులను సమీపంలో ఉన్న హర్ష హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. క్రాంతికి 40 శాతం మేర కాలిన గాయాలు ఉండటంతో అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ కేవీఎల్ఎన్ రెడ్డి తెలిపారు.

క్రాంతికి గతంలో ఒకసారి కాలిన గాయాలతో చికిత్స జరిగిందని, మళ్లీ ఈ సందర్భంలో అదే ప్రాంతంలో గాయాలు అవటంతో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారని అన్నారు. క్రాంతి తమ ఊరి వాడే అని, టైంపాస్ కోసం కళాశాలకు వచ్చి వెళ్తుంటాడని ఆ క్రమంలోనే ఫ్లెక్సీ విషయంలో సహాయం చేయబోయి ప్రమాదానికి గురి అయ్యాడు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News