ఎరిమల వాగు కబ్జా
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఎరిమల వాగు కబ్జాకు గురవుతోంది.
దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఎరిమల వాగు కబ్జాకు గురవుతోంది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి ఆధారమైన ఎరిమల వాగు కాలుష్య కాసారానికి నిలయంగా మారిపోయింది. కొందరు రియల్టర్లు లేఔట్లు అభివృద్ధిలో భాగంగా రాత్రుళ్లు ఎరిమల వాగులో టిప్పర్లతో మట్టి, బండరాళ్లు డంప్ చేస్తున్నారు. ఇక ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారి పాఠశాలకు దారి కోసం ఎరిమల వాగులో అడ్డంగా వంతెన నిర్మించారు.
ఇలా అడ్డగోలుగా వాగులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో 2020 అక్టోబర్లో (దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం) కురిసిన భారీ వర్షాలకు వాగులో ప్రవహించాల్సిన నీరు రోడ్డుపైకి రావడంతో కాలనీలన్నీ జలమయ్యాయి. విద్యుత్ సస్స్టేషన్ కూడా నీటిలో మునిగిపోయింది. కార్లు, మోటార్ బైకులు నీళ్లలో కొట్టుకుపోయి రెండు రోజులపాటు ప్రజలంతా బిక్కుబిక్కు మంటూ ఇండ్లలోనే గడిపారు. ఇంతటి విపత్తులు వచ్చినప్పటికీ ఆ తర్వాత చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
సాగు, తాగు నీటికి ఆధారమైన ఎరిమల వాగు ...
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ కూడా నుంచి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర ఎరిమల వాగు ప్రవహిస్తుంది. సాగు, తాగు నీటి అవసరాల కోసం ఈ వాగుపై దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇస్మాయిల్ ఖాన్ కూడా, యంనంపేట, ఘట్కేసర్, బొక్కినిగూడాల్లో భారీ ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించారు.
కొంతకాలానికి స్వచ్ఛమైన నీరు పారాల్సిన ఎరిమల వాగులో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల నుంచి రసాయన వ్యర్ధాలను విడుదల చేయడం ప్రారంభించారు. దీంతో వ్యవసాయం తగ్గు ముఖం పట్టింది. ఘట్కేసర్ మండలం నగర శివారు ప్రాంతం కావడం, ఇక్కడ వ్యవసాయ భూములకు ధరలు పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలుపెట్టారు.
అవినీతి అధికారుల అండదండలు...
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని ఎరిమల వాగును సైతం కబ్జా చేయడం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. లంచగొండితనానికి అలవాటు పడిన అధికారులు వాగు కబ్జా అవుతున్నా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.లక్షలు ముడుపులు తీసుకుని కబ్జాకారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పోచారం మున్సిపాలిటీ యంనంపేటలో మైనింగ్ శాఖ అనుమతి లేకుండా ఓ రియల్టర్ 5 ఎకరాల భూమిలో సెల్లార్ తవ్వకాలలో మట్టిని తవ్వి ఎరిమల వాగు ఒడ్డున, ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని మైసమ్మ గుట్ట ప్రాంతంలో డంప్ చేస్తుండగా పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు సదరు రియల్టర్కు మైనింగ్ శాఖ దాదాపు రూ.30 లక్షల జరిమానా వేసినట్లు సమాచారం.
కానీ ఎరిమల వాగులో మట్టిని డంప్ చేస్తున్న వారిపై ఇరిగేషన్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్ భూములలో చెరువులు, కుంటలు, కాలువలు కబ్జాలు కాకుండా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రా అంటే పట్టించుకోకుండా రియల్టర్లు కాలువను కబ్జా చేస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి జీవనది లాంటి ఎరిమల వాగును కబ్జా చెరనుంచి కాపాడాలని స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్
ఎరిమల వాగులో మట్టి, బండరాళ్లు డంప్ చేస్తున్న విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ తెలిపారు. ఈ డంపింగ్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. ఎరిమల వాగును పూర్తిగా సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు.