Illegal constructions : బడా బిల్డర్ బరితెగింపు.. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు..

విలువైన ప్రభుత్వ భూముల పై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోతున్నారు.

Update: 2024-08-02 13:55 GMT

దిశ, దుండిగల్ : విలువైన ప్రభుత్వ భూముల పై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. భూ దందాలపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో బోర్డులు పీకేసీ ఏకంగా అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఆక్రమిత భూముల్లో సూచికలు మాయమవుతున్నా.. సర్కారు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ స్థలాలకు ఎసరు..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వేనెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వేనెంబర్ 170/1 లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మి శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మిస్తోంది. ప్రభుత్వ భూమిలో వైడ్ నంబర్.002095/హెచ్ఎండీఏ/0433/ఎంఈడీ/2023 పేరిట 2023, మే 4న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు పొందడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు చేపడుతుండడంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చిలో సదరు అక్రమనిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. అంతేకాకుండా జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దుచేయాలంటూ 2024, ఏప్రిల్ 15 న దుండిగల్ తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖరాశారు.

దిశ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం..

మల్లంపేటలోని లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ ప్రభుత్వ స్థలంలో విల్లాలను నిర్మిస్తుండడంతో దిశ దినపత్రికలో పథాకశీర్షికన వరుస కథనాలు వెలువడ్డాయి. తేరుకున్న రెవెన్యూ అధికారులు జులై 11వ తేదీన లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ సర్వే నెంబర్ 170/1 ప్రభుత్వ స్థలంలో సూచిక బోర్డును పెట్టారు. మరుసటి రోజునే దుండగలు రెవెన్యూ యంత్రాంగం పెట్టిన సూచిక బోర్డును మాయం చేశారు. దీంతో జులై 12వ తేదీన ‘దిశ’ ప్రభుత్వ ’సూచిక బోర్డు మాయం‘ కథనాన్ని వెబ్ లో ప్రచురించింది. స్పందించిన మేడ్చల్ జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశాల మేరకు దుండిగల్ రెవెన్యూ అధికారులు ఆఘమేఘాల మీద మరోసారి ఆ స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డులను పీకేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. అయినా ఆగని భూ కబ్జాదారులు గురువారం రాత్రి ముచ్చటగా నాలుగోసారి బోర్డును పీకేయడంతో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం మరోసారి బోర్డును ఏర్పాటు చేశారు. సూచిక బోర్డు ఎదురుగా ఉన్న బిల్డర్ గుర్రం విజయలక్ష్మి బరితెగిస్తూ శుక్రవారం దగ్గరుండి నిర్మాణాలు జరిపిస్తుంది. భూ కబ్జాదారులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

రెవెన్యూ అధికారుల పై ఎదురుదాడి..

శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ సర్వేనెంబర్ 170/1 ప్రభుత్వ స్థలంలో శుక్రవారం గుర్రం విజయలక్ష్మి దగ్గరుండి నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో సమాచారం అందుకున్న ఆర్ఐ ప్రదీప్ రెడ్డి, మండల తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ఆదేశాలతో పనులను అడ్డుకున్నారు. అధికారుల పై గుర్రం విజయలక్ష్మి సిబ్బందితో దాడికి యత్నించడంతో పాటు, బూతులు తిట్టి పంపినట్లు సమాచారం.

అక్రమనిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు..తహశీల్దార్..

మల్లంపేట శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థలో శుక్రవారం జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై దిశ ప్రతినిధి మండల తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ను వివరణ కోరారు. ఆయన స్పందింస్తూ తప్పుడు పత్రాలు సృష్టించి సర్వే నంబర్ 170/5 ఎక్సటెన్షన్ పేరుతో 2023లో హెచ్ఎండీఏ అనుమతులు పొందిన నిర్మాణసంస్థ సర్వేనంబర్ 170/1 ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారన్నారు. అనంతరం జాయింట్ సర్వే నిర్వహించాలని ఏప్రిల్ 15, 2024 హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ రాసినట్లు తెలిపారు. శుక్రవారం పనులు మొదలు పెట్టినట్లు సమాచారం అందడంతో అడ్డుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, సదరు నిర్మాణ సంస్థ పై త్వరలో శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు.

Tags:    

Similar News