నిజాంపేట్ భూ కబ్జాల వెనుక పెద్దల హస్తం ?

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భూ కబ్జాల పరంపర కొనసాగడం పాలకుల అసమర్ధతకు, అవినీతికి దర్పణం పడుతుంది.

Update: 2023-05-05 14:04 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భూ కబ్జాల పరంపర కొనసాగడం పాలకుల అసమర్ధతకు, అవినీతికి దర్పణం పడుతుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం కావడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. నీ కింత, నాకింత అనేలా సాగుతున్న ఈ దుర్మార్గపు దందాలు పెచ్చు మీరిపోతు తెలంగాణ సర్కారు పాలనను అపహాస్యం చేస్తున్నాయి.

ఈ పాపాలకు స్థానిక ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించడం స్థానిక బీఆర్ఎస్ పార్టీలో సైతం చర్చకు దారితీస్తుంది. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ఇతగాడు తనపాపంలో మరికొందరికి నిజాంపేట్ లో ద్వితీయ స్థాయి నేతకు కూడా స్థానం కల్పిస్తూ చేతికి మట్టి అంటకుండా చక్రం తిప్పుతున్నట్లు పుకార్లు వినిపించడం గమనార్హం. చేస్తున్న కబ్జాల పై పర్సెంటెజీలు మాట్లాడుకుని తన పదవి కాలం పూర్తి అయ్యేలోపు అన్నీ తుదముట్టుంచేందుకు కంకణం కట్టుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

సర్వేనెంబర్ 332లో కబ్జా కథకు అతనే మూలం ?

నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో విలువైన ప్రభుత్వ స్థలం అది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆ స్థలంలో ఓ పెట్రోల్ బంక్ యజమాని కన్నుపడింది. గజం విలువ లక్షలలో పలుకుతుండడం మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో ఎలాగైనా ఆ ప్రభుత్వ స్థలం కొట్టేయాలని దీక్ష చేపట్టాడు. గత ఆరు నెలల క్రితమే అట్టి స్థలంలో కబ్జా చేసి రూము నిర్మించాడు. కానీ దిశ ఆ కబ్జాను బయట పెడుతూ 2022 అక్టోబర్ 13వ తేది ధర్జాగా కబ్జా అనే కథనంతో ప్రచురించింది. ప్రస్తుతం బాచుపల్లోలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ సురేందర్ స్పందించి 2022 అక్టోబర్ 14వ తేది రోజు కూల్చివేశారు. మరుసటి రోజు దిశ దినపత్రిక లో అక్రమ నిర్మాణం పై ఉక్కుపాదం అనే శీర్షికతో మళ్ళీ కథనం ప్రచురించడం జరిగింది. ఆ సంఘటన జరిగీ నేటికీ ఆరు నెలలు పూర్తి కావస్తుంది.

59 జీవోకు దరఖాస్తు.. అక్రమ రిజిస్ట్రేషన్ ?

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు రెగ్యులరైజేషన్ స్కీం తీసుకువచ్చింది. 2014 కంటే పూర్వం ప్రభుత్వ స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారికీ జీవో 58, 59 కింద రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో వచ్చిన ఈ జీవో ల ప్రకారం నిజాంపేట్ లో సర్వేనెంబర్ 332లో జరిగిన భూ కబ్జా జీవో 59 కు ఏమాత్రం అర్హత కాదు. అంతేకాక 2014 ముందు కానీ, 2022 వరకు కూడా ఆ స్థలం కాళీస్థలం మాత్రమే ఉంది. కానీ నేడు ఆ స్థలం కైవసం చేసుకునేందుకు సదరు కబ్జాదారుడు తన పైరవీ ఉపయోగించి అడిషనల్ కలెక్టర్ స్థాయిలో మ్యానేజ్ చేసి ప్రభుత్వ స్థలం అధికారికంగా కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కబ్జా వ్యవహారంపై, అక్రమ 59 జీవో రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం.. బాచుపల్లి తహసీల్దార్ సురేందర్...

నిజాంపేట్ గ్రామ సర్వేనెంబర్ 332లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా అవుతున్న దృశ్యాన్ని దిశ బాచుపల్లి తహసీల్దార్ సురేందర్ దృష్టికి తీసుకువెళ్ళింది. 2022లో కబ్జా అయిన స్థలాన్ని మీరే కాపాడి నేడు మళ్ళీ 59 జీవో పేరుతో కబ్జా చేస్తుంటే ఎలా ఊరుకుంటారని ప్రశ్నించింది. స్పందించిన తహసీల్దార్ సురేందర్ 332 లో జరిగిన కబ్జాను పరిశీలిస్తామని, అక్రమ రిజస్ట్రేషన్ జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటానని దిశకు తెలిపారు.

Tags:    

Similar News