హరిజనులు, గిరిజనులతో ఆడుకోవద్దు

ఎస్సీ, ఎస్టీలకు అందించే సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యం వహించి నేరస్తులుగా నిలబడవద్దని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ పేర్కొన్నారు.

Update: 2025-03-18 13:03 GMT
హరిజనులు, గిరిజనులతో ఆడుకోవద్దు
  • whatsapp icon

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీలకు అందించే సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యం వహించి నేరస్తులుగా నిలబడవద్దని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు భూ సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల అంశాలలో తలెత్తుతున్న లోపాలను పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పోలీసులు సక్రమంగా అమలు చేస్తున్నారా అని, వారికి రావలసిన రాయితీల అంశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

46 నెలలుగా..

ఎస్సీ, ఎస్టీలకు అందించే సబ్సిడీ రుణాల అంశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గత 46 నెలలుగా ఎస్సీ, ఎస్టీలకు అందించాల్సిన సబ్సిడీ రుణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, సబ్సిడీ మంజూరు విషయంలో ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులు నాన్ పర్ఫామెన్స్ అకౌంట్, సిబిల్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని దుయ్య బట్టారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు భవిష్యత్తులో రుణాలను పొందలేని పరిస్థితిలో ఉంటారని, ఈ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సబ్సిడీలను సకాలంలో మంజూరు చేయాలని పేర్కొన్నారు.

    అణగారిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం హరిజనులు, గిరిజనులతో ఆడుకోవద్దని హితవు పలికారు. సమీక్షకు ముందు ఆయనకు జిల్లా కలెక్టర్ గౌతం గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మల్కాజ్గిరి, మెడ్చల్ డీసీపీలు పద్మజ, కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, ఆర్డీఓలు శ్యాంప్రకాష్, ఉపేందర్ రెడ్డి, ఏసీపీలు, పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News