ఈ కుట్రలు ఎవరివి.. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇండ్ల కూల్చివేతలు?
స్థలం అమ్మింది ఒకరు.. అక్కడ నిర్మించుకున్న ఇంటికి నంబర్లు ఇచ్చింది మరొకరు. ఆ పరిసరాల్లో రోడ్లు వేసింది ఇంకొకరు. స్థంభాలు వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థలం అమ్మిన వారు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు
స్థలం అమ్మింది ఒకరు.. అక్కడ నిర్మించుకున్న ఇంటికి నంబర్లు ఇచ్చింది మరొకరు. ఆ పరిసరాల్లో రోడ్లు వేసింది ఇంకొకరు. స్థంభాలు వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థలం అమ్మిన వారు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు కాగా, మిగతా వారంతా అధికారులే. అధికారులే అన్నీ చేసి ఇంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేతలు చేశారు. వారి ఇండ్లు కూల్చివేతతో నిరుపేదలు లబోదిబోమంటున్నారు. ఇదంతా లీడర్ల నడుమ గొడవలను పేదలపై చూపి కక్ష తీర్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో నడుస్తున్న తతంగం ఇది. లీడర్ల మధ్యలో అధికారులు పూర్తిగా బకరాలు అయిపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. అదే అధికారులు అన్నీ చేయిస్తూ వారే తిరిగి ఇండ్లు కూల్చివేయించడం తీవ్ర చర్చకు దారితీస్తున్నది.
దిశ, పటాన్ చెరు : అమీన్ పూర్ మండలం ఐలాపూర్, ఐలా పూర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 1 నుండి 200 వరకు సుమారు 1200 ఎకరాలకు పైగా వివాదాస్పద భూములు ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఈ భూముల తతంగం కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఎలాంటి నిర్మాణాలు చేసేందుకు వీలు లేకుండా కోర్టు అదేశాలున్నాయి. ఈ భూములపై కన్నేసిన కొందరు వివాదాస్పద భూముల్లో వెంచర్లు వేశారు. 80, 100, 120, గజాలతో ప్లాట్లు వేసి విక్రయించారు. తక్కువ ధరకు ప్లాట్లను అమ్మడంతో రోజువారీ పనులు చేసుకునే కార్మికులు, సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేశారు. గత రెండేళ్లుగా ఈ భూముల్లో నిర్మాణ పనులు జరుగుతున్న ఒక్క అధికారి కూడా అక్కడ తొంగి చూసినా దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అక్కడ ప్రయివేటు వ్యక్తులు ఇల్లీగల్ గా ప్లాట్లను విక్రయించగా, అధికారులు సదరు నిర్మాణాలకు కరెంట్ కనెక్షన్లతోపాటు, నీటి సౌకర్యం, ఇంటి నెంబర్లను సైతం కేటాయించారు. ఉన్నట్టుండి గత శనివారం తెల్లవారుజామున పెద్దఎత్తున అధికార యంత్రాంగం ఐలాపూర్ చేరుకుని సుమారు 300 పైగా నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో అందులో నివాసముంటున్న బాధితులు ఉన్న గూడు చేదిరిపోవడంతో ఎం చెయ్యాలో అర్థం కాక లబోదిబోమంటున్నారు.
అధికారులదే ఈ పాపమంత?
వివాదాస్పద భూముల్లో గత రెండేళ్లుగా కొందరు ప్లాట్లను చేసి విక్రయిస్తున్న అధికారులు అటు కన్నెత్తి చూడలేదు. దానికి తోడు ఆ ప్రాంతంలో విద్యుత్ శాఖ అధికారులు స్థంబాలను ఏర్పాటు చేసి విద్యుత్తు కనెక్షన్లు సైతం జారీ చేసింది. ఇందుకు గాను సుమారు 3 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. ఐలా పూర్, ఐలా పూర్ తండా గ్రామపంచాయతీ అధికారులు వందకు పైగా ఇండ్లకి ఇంటి నంబర్లను జారీ చేశారు. సదరు కాలనీలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లో జరిగినప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను కూల్చి వేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.లీడర్ల పోరులో అధికారులు బకారాలు అయ్యారని స్థానికులు నవ్వుకుంటున్నారు.
ఎకరాకు 800 గజాలు ఎవరికెళ్లింది..?
ఈ భూముల్లో అక్రమంగా ప్లాట్లు వేసి అమాయకులకు విక్రయించారు. ఈ మొత్తం భాగోతం వెనుక చక్రం తిప్పిన పెద్దలు ఎకరాకు 800 గజాలు తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రంగం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చి మారి ఈ తతంగం నడిపినట్లు ఆరోపణలు వినిపోయిస్తున్నాయి. రైతులకు గజానికి రూ.ఐదు వేలు మాత్రమే చెల్లించి కొనుగోలు దారులకు రూ.15 వేల వరకు విక్రయించినట్లు తెలుస్తుంది. ఈ అక్రమ బాగోతాన్ని నడిపిన కొందరు రూ.వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు బాధితులు తెలిపారు. అక్రమంగా వందల కోట్లను వెనకేసుకున్న అక్రమార్కులని వదిలి, డబ్బులిచ్చి కొన్న పేద ప్రజల మీద పడడమేంటని ప్రశ్నిస్తున్నారు.
లీడర్ల మధ్య గొడవలకు పేదలు బలి
ఐలాపూర్ భూముల్లో నిర్మాణాల విషయంలో అటు అధికారులు, ఇటు లీడర్లు కలిసి పనిచేశారన్న ఆరోపణలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ బాగోతంలో జరిగిన లావాదేవీల్లో కొందరి మధ్య వచ్చిన విబేధాలతోనే పేదల ఇండ్లను కూల్చి రోడ్డున పడేశారని స్థానికంగా చర్చ జరుగుతుంది. తమ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుని పంపకంలో తేడాలు వస్తే తమను బలి పశువుల్ని చెయ్యడం ఎంత వరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
అధికారులు, ప్రజాప్రతినిధుల అక్రమార్జన, అలసత్వంతో కొందరు రూ.వందల కోట్లు అర్జించి తమకు అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వంతో నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ భూబాగోతంలో కింది స్థాయి అధికారుల నుంచిఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని వారు తెలిపారు. సుమారు 600 కోట్లపైగా చేతులు మారిన ఈ వ్యవహారం ఈడీ, సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇటు ఇండ్లు కూల్చి అటు డబ్బులు కోల్పోయిన తమను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని, ఇల్లు కోల్పోయిన అందరికి ప్రత్యామ్నాయాన్ని చూపాలని విజ్ఞప్తి చేశారు.