బడా బిల్డర్ బరితెగింపు

దుండిగల్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు కబ్జా చేస్తూ త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ బరితెగిస్తున్న తీరు అందరిని విస్మయానికి గురిచేస్తుంది.

Update: 2024-12-03 15:38 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : దుండిగల్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు కబ్జా చేస్తూ త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ బరితెగిస్తున్న తీరు అందరిని విస్మయానికి గురిచేస్తుంది. దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో త్రిపురా ల్యాండ్ మార్క్ పేరుతో 10 సంవత్సరాల క్రితం ల్యాండ్ మార్క్-1 నిర్మాణం చేపట్టిన ఎండీ పసుపులేటి సుధాకర్ వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు, చెరువు, కుంటలను కబ్జా చేసి అక్రమ సంపాదనకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేయధ్యంలో బౌరంపేటలో నిర్మించిన త్రిపుర ల్యాండ్ మార్క్-1 కు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 694 ప్రభుత్వ భూమి 1.25 ఎకరాలు ఉండగా దానిలోని 2033 గజాల్లో ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

    బౌరంపేట పరిధిలోని సర్వే నంబర్ 756 లో 1.07 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 308 గజాలను ఆక్రమించి త్రిపురా ల్యాండ్ మార్క్-2 నిర్మాణాలు చేపట్టగా అదే వెంచర్ లో బౌరంపేట పెద్ద చెరువుకు సంబంధించిన 95 ఎకరాల్లో 3188 గజాల బఫర్ జోన్ ను ఆక్రమించి విల్లాలు నిర్మించగా అప్పట్లో పెద్ద దుమారమే లేసింది. త్రిపురా ల్యాండ్ మార్క్-3లో సైతం అదే తీరు బౌరంపేట సర్వే నంబర్-225 ప్రభుత్వ భూమిలో 10.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. త్రిపురా ల్యాండ్ మార్క్-3 ప్రాజెక్ట్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి సుమారు1279 గజాల్లో స్విమ్మింగ్ పూల్, పార్క్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. త్రిపురా ల్యాండ్ మార్క్-5లో దొమ్మర పోచంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 181 లో 8.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా త్రిపురా ల్యాండ్ మార్క్ సంస్థ 2020 గజాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    అంతేకాక పక్కనే 6 ఎకరాల్లో విస్తరించి ఉన్న పడిగ సముద్రం కుంట బఫర్, ఎఫ్టిఎల్ జోన్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. నిర్మాణ సంస్థ వెనకాల 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న మొండి కుంటను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బౌరంపేట సర్వీ నంబర్ 225 లోని ప్రభుత్వ భూమిలో 2336 గజాలను ఆక్రమించి త్రిపుర ల్యాండ్ మార్క్-4లో అక్రమనిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కోమటి కుంట బఫర్ జోన్ ను ఆక్రమించి సదరు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సమచారం.

జాయింట్ సర్వే..

నవంబర్ నెలలో దిశ దిన పత్రికలో త్రిపుర ల్యాండ్ మార్క్ అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు వెలువడడంతో స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నవంబర్ 19న జాయింట్ సర్వే నిర్వహించి కోమటి కుంట, పడిగ సముద్రం కుంటతో పాటు మొండి కుంటను ఆక్రమించి సదరు నిర్మాణ సంస్థ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు తేల్చారు.

    జాయింట్ సర్వే నిర్వహించి 20 రోజులు గడుస్తున్నా అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిర్మాణ సంస్థ ప్రతినిధులతోపాటు పసుపులేటి సుధాకర్ తరుచూ దుండిగల్ మండల రెవెన్యూ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

త్రిపుర ల్యాండ్ మార్క్ లో అక్రమనిర్మాణాలు జరిగింది వాస్తవమే : తహసీల్దార్

త్రిపుర ల్యాండ్ మార్క్ అక్రమ నిర్మాణాలపై దుండిగల్ మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ను దిశ దిన పత్రిక ప్రతినిధి వివరణ కోరగా గత నెల 19న ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కోమటి కుంటలో సుమారు 1600 గజాలను ఆక్రమించి రేకులు పాతారని, వాటిని తీసేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. పడిగ సముద్రం కుంటలో సైతం అక్రమనిర్మాణాలు జరిగినట్లు తెలిపారు.


Similar News