బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా
కవితపై వ్యాఖ్యలకు నిరసనగా ఐడీపీఎల్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
దిశ, పేట్ బషీరాబాద్: రాబోవు రోజులలో తెలంగాణ ప్రజలు బండి సంజయ్ ను తరిమి తరిమి కొడతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఐడీపీఎల్ ప్రధాన రహదారిలో శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి అనంతరం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అహంకార ధోరణితో బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, రోజురోజుకు బీజేపీకి ప్రజాధరణ తగ్గుతుండటంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని ఆరోపించారు.
మహిళ ప్రజాప్రతినిధి పట్ల వ్యాఖ్యలు చేసే ముందు తన ఇంటిలో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. అనుచిత వ్యాఖ్యలతో బండి సంజయ్ ఇదే విధంగా వ్యవహరిస్తే తెలంగాణలో ఆయన ఎటు తిరగలేని పరిస్థితి వస్తుందని, ఆ సమయంలో గుజరాత్ నుంచి నాయకులు వచ్చినా అతన్ని కాపాడలేరని పేర్కొన్నారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మహిళలతో కలిసి బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇన్స్పెక్టర్ పవన్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.