Pet Basheerabad: ప్రభుత్వ భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్

కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రస్తుత

Update: 2024-07-23 14:17 GMT

దిశ,పేట్ బషీరాబాద్: కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రస్తుత స్థితిగతులపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కుత్బుల్లాపూర్ మండలం పెట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 25/1, 25/2 లలో అసలు ఉండాల్సిన ప్రభుత్వ భూమి ఎంత..?, వాటిని ఏ శాఖలకు కేటాయించారు..?, వివాదాలు, కోర్టు కేసులు ఉన్న భూమి ఎంత..? 58, 59 జీవో అనుసరించి జారీ చేసిన పట్టాలు ఎన్ని తదితర అంశాలపై ఎమ్మార్వో రెహమాన్, ఆర్ ఐ రేణుకలను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అదేవిధంగా మిగిలి ఉన్న భూములు సంరక్షణకు చేయాల్సిన పనులతో తో పాటుగా కబ్జాలకు గురైన భూముల విషయంపై ఏ విధంగా ముందుకెళ్లాలని అనే అంశంపై చర్చించారు. మొత్తంగా సర్వే నెంబర్ 25/1, 25/2 లలో ఉన్న ప్రభుత్వ భూమిపై ప్రస్తుత స్థితి పై పూర్తి నివేదిక ను ప్రభుత్వానికి తెలియజేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా గాజులరామారం సర్వేనెంబర్ 342 లో కూడా జిల్లా యంత్రాంగం త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది.

255 ఎకరాలు ప్రభుత్వ భూమి..

కుత్బుల్లాపూర్ ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో కొంపల్లి గ్రామం సర్వేనెంబర్ 101, 104 లో ప్రభుత్వ భూమి మండలాలుగా విభజన అయిన సమయంలో కుత్బుల్లాపూర్ మండలం పెట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25 బై వన్, 25/2 గా మారింది. దీంతో సర్వే నెంబర్ 25/1 లో 195 ఎకరాల 34 గుంటల భూమి, సర్వేనెంబర్ 25/2 లో 59 ఎకరాల 35 గుంటల భూమి ఉన్నట్లుగా తేలింది. కాగా సర్వే నెంబర్ 25/1 లో ఉన్న 160 ఎకరాల అసైన్ భూమిని నోటిపై చేయగా 15 ఎకరాల క్వారీ భూమిని రాజీవ్ స్వగృహ కు కేటాయించారు. ఇదే సర్వే నెంబర్లు మూడు ఎకరాల భూమిని హెచ్ఎండిఏ కు, సర్వే నెంబర్ 25/2 లో 35 ఎకరాలను హెచ్ఎండిఏ కు కేటాయించారు. ఆయా సర్వే నెంబర్లు లో ఓ ప్రైవేట్ స్కూల్ కి, స్మశాన వాటిక, పోలీస్ స్టేషన్ లకు కొంత కేటాయించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న ఇతర శాఖలకు కేటాయించిన రాజీవ్ స్వగృహ భూములు, హెచ్ఎండిఏ కు కేటాయించిన భూములలో సింహభాగం కబ్జాకు గురైంది. వీటిలో ప్రస్తుతం చాలా వరకు కోర్టు కేసులు ఉన్నాయి. ఈ అంశాలను మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

Tags:    

Similar News