రుణాల మంజూరులో బ్యాంకర్ల పాత్ర కీలకం..

Update: 2023-03-17 13:20 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలను అందజేయాలని మేడ్చల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. శుక్రవారం శామీర్ పేట లోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడారు. ప్రభుత్వాలు అర్హులైన వారికి అనేక సంక్షేమ పథకాల కింద రుణాలను మంజూరు చేస్తున్నాయని వాటిని లబ్ధిదారులకు చేరేలా బ్యాంకర్లు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం మొదలుకొని వారికి రుణాలు అందించే వరకు బ్యాంకర్లు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తారని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఏసీపీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 190 శాతం సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. దీంతో పాటు విద్యార్థులకు సంబంధించి వారి ఉన్నత చదువులకు విద్యారుణాలను అత్యధిక సంఖ్యలో మంజూరు చేయాలని కోరారు.

ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా లీడ్ బ్యాంక్ మేనేజర్ పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అందచేసిన రుణాల వివరాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిషోర్ కుమార్, కెనరా బ్యాంకు ఏజీఎమ్ ఇందిర, ఎస్బీఐ ఏజీఎమ్ సతీష్; యూబీఐ ఏజీఎం ప్రకాశరావు, టీజీబీ యూసుఫ్, నాబార్డు అధికారి శివిశర్మ, ఆర్బీఐ అధికారి రాజేంద్ర ప్రసాద్, డీఆర్డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News