వామ్మో ఇంత ఖర్చా..! చాయ్, బిస్కట్లకు రూ.2.80 లక్షలు
గత ప్రభుత్వం ఏది చేసినా అద్భుతమే. ఏ హామీ ఇచ్చినా ఓ సంచలనమే. ఏ ప్రోగ్రామైనా పెద్ద ఆర్భాటమే, హంగామే.
దిశ, గజ్వేల్: గత ప్రభుత్వం ఏది చేసినా అద్భుతమే. ఏ హామీ ఇచ్చినా ఓ సంచలనమే. ఏ ప్రోగ్రామైనా పెద్ద ఆర్భాటమే, హంగామే. అందుకే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీసు బిల్డింగ్ ఓపెన్ చేయడానికి ఏకంగా రూ.28 లక్షలు ఖర్చు చేశారు. చాయ్ బిస్కట్లకే రూ.లక్షల్లో ఖర్చు చేశామని బిల్లులు ఎత్తుకున్నారు. ఆహ్వాన పత్రికలకు కూడా రూ.లక్షల్లో ఖర్చు చేశామంటున్నారు. ఆఫీసు ఓపెనింగ్ ఖర్చుతో ఓ స్కూల్ బిల్డింగ్ ఈజీగా కట్టేయ్యొచ్చు. ఇంత ఆర్భాటంగా చేశారా? లేదంటే బిల్లులు ఎత్తుకున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పూల అలంకరణకు కూడా లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. నిజానికి వెయ్యి మంది అటెండయ్యే పెళ్లికి కూడా ఈ స్థాయిలో ఖర్చు కాదు. మున్సిపాలిటీ అధికారుల లెక్కలు చూస్తే వామ్మో అనిపిస్తున్నది. మున్సిపల్ ఆఫీసు బిల్డింగ్ ఓపెనింగ్ ఖర్చులను గజ్వేల్ కి చెందిన ఒకరు అధికారికంగా ఆర్టీఐ చట్టం కింద తీసుకోవడంతో బయటపడింది.
అంతా వాళ్లే..
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న వారే ఖర్చులు పెట్టారు. వారే సొంతంగా పెట్టి బిల్లులు తీసుకున్నారు. ఏఏఈ జి.కిష్టన్న రూ.6 లక్షలు, ఏఈ రాజేశ్ కుమార్ రూ.1.50 లక్షలు, ఆర్వో పి.రవిగోపాల్ రెడ్డి రూ.3 లక్షలు, టీవో పి.శ్రీలత రూ.80 వేలు, కే రాజివ్ రెడ్డి రూ.70 వేలు, ఎస్సై డా.మల్లిఖార్జున్ రూ.61,400 ఖర్చు చేశారట. అలాగే చాయ్ బిస్కట్లు, భోజనానికి రూ.2.80 లక్షలు పి.రవిగోపాల్ రెడ్డి ఖర్చు చేశారు. అలాగే జనరేటర్, మైక్ సిస్టం, ట్రాన్స్ పోర్టేషన్ కి రూ.1,44,166, రెడ్ కార్పెట్, వీఐపీ డైనింగ్ చైర్లు, క్లాథ్ వాల్స్, పూలతో అలంకరణకు రూ.4,78,028 జి.కిష్టన్న చేతుల మీదుగా ఖర్చయ్యాయి. వీడియోగ్రఫీ, ఫొటోలు, పెయింటింగ్ లకు పి.శ్రీలత రూ.2,45,000, మెమోంటోలు, శాలువాలు, టవల్స్, బ్యాడ్జీలకు కే రాజివ్ రెడ్డి రూ.99,046 ఖర్చు పెట్టారు. ఆఖరికి ఆహ్వాన పత్రికలకు, పూజా సామగ్రికి రూ.2,93,940 ఏ రాజేశ్ కుమార్ చేతుల మీదుగా ఖర్చు పెట్టారు. అంటే మున్సిపల్ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఏకంగా రూ.28,01,740 ఖర్చు చేశారు. 2021 జూన్ 10న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీసు బిల్డింగ్ ను ప్రారంభించారు. ఆ సందర్భంగా అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.