పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది : మంత్రి సీతక్క
పూలను పూజించి పండుగ చేసుకునే గొప్ప సంస్కృతి ప్రపంచంలో
దిశ, మెదక్ ప్రతినిధి : పూలను పూజించి పండుగ చేసుకునే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఇక్కడ లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో మైనం పల్లి సేవా సమితి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు లు మన ఊరి బతుకమ్మ పండగ సోమవారం బారీ స్థాయిలో ఏర్పాటు చేసి మహిళలు చీరల పంపిణీ చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క తో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కాల్వ సుజాత, శోభారాణి తో పాటు వేలాది మంది మహిళలు హాజరై బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మకు చెరువులకు బంధం ఉందన్నారు. ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలు జరిపేలా చెరువులు ఏర్పాటు చేశారా అన్నట్టుగా ప్రతి గ్రామంలో చెరువులు కనిపిస్తున్నాయని అన్నారు. ఆడ బిడ్డ ఉన్న ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతాయని అన్నారు.
ఆడ బిడ్డలను ఎదగనీయాలని కోరారు. మహిళలకు అండగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని, ఉచితంగా మహిళలు పుట్టింటికి వెళ్ళి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మహిళలకు 17 రకాల వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. మహిళల కోసం 200 లోపు ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలెండర్ అందించి ప్రజల పై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. వేలాది మందికి ఒకే చోటికి తీసుకు వచ్చి బతుకమ్మ సంబరాలతో పాటు చీరల పంపిణీ చేసిన మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ లను అభినందించారు. సేవా రంగంలో మైనం పల్లి ట్రస్ట్ ఎప్పూడూ ముందు ఉంటుందని, ఈ సారి మహిళల కోసం బతుకమ్మ సంబరాలు చేయడం సంతోషకరమని అభినందించారు. రోహిత్ మాట్లాడుతూ నియోజకవర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. మెదక్ లో మహిళలు ఘనంగా సంబరాలు నిర్వహించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, భారీ సంఖ్యలో మహిళలు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
బతుకమ్మ అడి పాటలు పాడిన మహిళా మంత్రులు...
మెదక్ లో నిర్వహించిన మా ఇంటి బతుకమ్మ సంబరాల్లో మంత్రి కొండా సురేఖ, సీతక్క లు మహిళలతో కలిసి ఆడారు. అలాగే కొండా సురేఖ బతుకమ్మ పాటలు పాడి అలరించారు.
ఆకట్టుకున్న మంగ్లీ బతుకమ్మ పాటలు...
మైనం పల్లి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మా ఇంటి బతుకమ్మ లో సినీ గాయని మంగ్లీ, ఇంద్రాణి లు బతుకమ్మ పాటలతో అలరించారు. మంగ్లీ పాటలకు మహిళలకు ముగ్ధులయ్యారు. ఆమె పాడుతుంటే మహిళలు కేరింతలు కొట్టారు. సినీ గాయని వస్తున్న విషయం తెలియడంతో పలు ప్రాంతాలకు చెందిన మహిళలు వచ్చి వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు