కొమురవెల్లి మల్లన్నకు శఠ గోపం..

కోరిన కోరికలు తీర్చే కొమురవెల్లి మల్లన్నకే దేవాలయ అధికారుల శఠగోపం పెట్టారు.

Update: 2024-11-28 17:20 GMT

దిశ, సిద్ధిపేట ప్రతినిధి/కొమురవెల్లి : కోరిన కోరికలు తీర్చే కొమురవెల్లి మల్లన్నకే దేవాలయ అధికారుల శఠగోపం పెట్టారు. మల్లన్న ఆలయ దేవాలయ ఆర్దిక లావాదేవీలకు సంబంధించి 2018 లో నిర్వహించిన ఆడిట్ లో 54 అంశాలు రూ.3 కోట్లకు పైగా లావాదేవీల పై అభ్యంతరాలు వ్యక్తంగా.. అప్పటి వరకు విధులు నిర్వహించిన ఐదుగురు ఈవోలకు, 11 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆలయ ఈవో త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఫైల్స్ క్లియర్ చేసే పనిలో ఉండగా గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన సదరు ఫైల్స్ మాయమవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్లితే మల్లన్న దేవాలయానికి సంబంధించి ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2017 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల విషయంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సూమారు 5 ఎదున్నరేళ్ల క్రితం ఆడిటర్ లక్ష్మీ నారాయణ సారధ్యంలో ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు 54 అంశాల్లో సుమారు రూ.3 కోట్ల పైగా లావాదేవీల పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంబీ రికార్డులు లేని మరమ్మతులు రూ.70.19 లక్షలు, అనుమతి లేని ప్రహారీ నిర్మాణానికి రూ.20.91 లక్షలు, ఒరిజినల్ బిల్లులు లేని ఉద్యోగుల అడ్వాన్సులు రూ.14.84 లక్షలు, అతిధుల భోజనాల ఖర్చులు రూ.5.34 లక్షలు, వాహనాల అద్దె రూ.4.56 లక్షలు, దుస్తుల రూ.13.96 లక్షలు, మొక్కల పెంపకం రూ.3.63 లక్షలు, వేలం పాట బకాయిలు రూ.22.29 లక్షలు, ఆలయ సిబ్బంది బ్యాంకుల్లో చెక్కుల ద్వారా విడుదల చేసిన రూ.33.26 లక్షలతో పాటుగా ఇతర ఖర్చుల పై అభ్యంతరాలు వ్యక్తంగా సదరు మూడెళ్ల ల్లో ఆలయంలో విధులు నిర్వహించిన 5 గురు ఈవోలు, ఆయా విభాగాల్లో పనిచేసిన 11 మంది ఉద్యోగులకు నాటి దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అప్పటి అధికారులు ఎంబీ రికార్డులు, బిల్లులు అందజేయగా సుమారు రూ.1 కోటికి పైగా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు చూపక పోవడంతో రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికి సదరు డబ్బులు విషయంలో ఇప్పటి వరకు అధికారుల పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

లెక్కల ఫైల్స్ మాయం..

మల్లన్న దేవాలయంలో 4 సంవత్సరాలుగా ఇంచార్జి ఈవోగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ డిసెంబర్ లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో గతంలో వచ్చిన అవినీతి ఆరోపణల పై నివేదిక తయారు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఆలయంలో పలు ఫైల్స్ మాయం అయినట్లు గుర్తించారు. ఈ మేరకు గతంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించిన నీల శేఖర్, వైరాగ్యం జగన్, మిన్నలపురం నర్సింహాలు కు అడిట్ అభ్యంతరాల ఫైల్ లు మాయం అవడం పై నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు కొండగట్టు, వరంగల్ భద్రకాళి, మేడారం ఆలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ఫైల్స్ మాయం అంశం మరో మారు తెర మీదకు రావడంతో దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు ఏం చర్యలు చేపడతారో చూడాలి మరీ.


Similar News