ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం ప్రభాకర్..
ప్రజల అభిప్రాయాలకు, ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధిని తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, హుస్నాబాద్ : ప్రజల అభిప్రాయాలకు, ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధిని తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం చైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్ లను కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆసీనులు కావింపజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి 1951 నుండి ప్రారంభీకులు బొప్పరాజు లక్ష్మీకాంత రావు లాంటి వారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారని గుర్తు చేశారు. పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు హుస్నాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఏర్పడ్డాయని, మున్సిపల్ భవన నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నామని అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలని, మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలన్నారు. పాత మున్సిపాలిటీలో అందరికీ ఉపయోగపడే విధంగా పోస్ట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లను తీసుకురావడానికి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బొప్పరాజు లక్ష్మీకాంత రావు నివాసాన్ని లైబ్రరీకి ఉపయోగించుకోవాలని తెలిపారు. గతంలో పని చేసిన శాసన సభ్యులు, సర్పంచ్ లు, మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, అధికారులు సమన్వయంతో పనిచేశారని ఇదే ఒరవడిని రానున్న పాలకవర్గం కూడా సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, జనగాం నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలని, భవిష్యత్ లో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి జరగాలని అన్నారు. భవిష్యత్ లో ఏ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ జరిగినా మున్సిపాలిటీ స్టీల్ బ్యాంక్ నుండి ఇచ్చేలా కార్యాచరణ చేయాలని, దానికి ఈరోజు నుండే అంకురార్పణ జరగాలని అన్నారు. హుస్నాబాద్ లో ఏ ఫంక్షన్ అయినా ఏ హోటల్ లో అయినా ప్లాస్టిక్ వాడకుండా కార్యాచరణ ప్రారంభించుకోవాలని, హుస్నాబాద్ సుందరీకరణ, మౌళిక వసతులు, సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులు తీసుకొస్తానన్నారు. హుస్నాబాద్ ప్రధాన రహదారి లో షాప్ లోకి నీళ్లు పోయే పరిస్థితి ఉండేదని ఉన్నతాధికారులను తీసుకొచ్చి అలాంటి పరిస్థితి రావద్దని కార్యాచరణ ప్రారంభించామని, నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని దానిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
హుస్నాబాద్ లో 150 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రి గా మార్చామని, డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని పశు సంపద, మత్స్య సంపద, కుల వృత్తులు ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్, గురుకుల స్కూల్ లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మొటిక్ చార్జీలు పెంచిందని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు, నియామకాలు చేపట్టిందన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నామని, మార్కెట్ కమిటీ చైర్మన్, టెంపుల్ చైర్మన్ లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అధికారులు కూడా హుస్నాబాద్ నియోజవర్గ అభివృద్ది కోసం కలిసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో రవీందర్ రెడ్డి,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు..
విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తుగా ఉదయం అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.