డంపు యార్డుతో గ్రామానికి ముప్పు
పరిశ్రమల కాలుష్యంతో సంగారెడ్డి మున్సిపాలిటీ డంపు యార్డుగా మారిందని, ఈ కంపు మాకు వద్దంటూ గుండ్ల మాచూనూర్ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.
దిశ ,హత్నూర : పరిశ్రమల కాలుష్యంతో సంగారెడ్డి మున్సిపాలిటీ డంపు యార్డుగా మారిందని, ఈ కంపు మాకు వద్దంటూ గుండ్ల మాచూనూర్ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. కంది మండలం ఆరుట్ల శివారులోని సర్వే నెంబర్ 133 లో సంగారెడ్డి మున్సిపాలిటీ చెత్త నిల్వ కోసం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం నాడు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండ్ల మాచునూర్ గ్రామానికి అతి సమీపంలో డంప్ ప్యాడ్ పనులు కొనసాగుతుండగా ఇదివరకే ఆ గ్రామస్తులు పలుమార్లు అడ్డుకున్నారు.
మంగళవారం ఉదయం కంది తహసీల్దార్ విజయలక్ష్మి, హత్నూర తహసీల్దార్ ఫర్హింన్ షేక్, సంగారెడ్డి మున్సిపాల్ కమిషనర్ చౌహన్ ప్రసాద్ పోలీసు సిబ్బందితో గుండ్ల మాచూనూర్ గ్రామానికి చేరుకొని స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మా గ్రామాన్ని ఆనుకుని ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులతో ఇప్పటికే గ్రామంలో ఉండలేకపోతున్నాం, ఇక డంప్ యార్డ్ నిర్మాణం చేపడితే గ్రామంలో ఎలా ఉండేదని వారు అధికారులను నిలదీశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ నిర్మాణం వద్దే.. వద్దంటూ మొండికేసి కూర్చున్నారు. అంతేకాకుండా అధికారులకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. చేసేదేమీలేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.