Ponnam Prabhakar : అక్కసుతోనే ప్రతిపక్షాలు విమర్శలు

10 ఏళ్లలో రైతుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రైతు రుణమాఫీని కూడా పూర్తి చేస్తుంటే అక్కసుతో విమర్శించడం సిగ్గుచేటని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-08-20 09:52 GMT

దిశ, హుస్నాబాద్ : 10 ఏళ్లలో రైతుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రైతు రుణమాఫీని కూడా పూర్తి చేస్తుంటే అక్కసుతో విమర్శించడం సిగ్గుచేటని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ ఎన్ని విడతల్లో ఎంతమందికి చేసిందో చెప్పాలని, బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు లక్షల వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేస్తే రెండు పార్టీలు అక్కసు వెళ్లగకుతున్నాయని ఆరోపించారు. అన్ని రకాల వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే కళ్లు బైర్లు కమ్మి కావాలని దురుద్దేశంతోనే రుణమాఫీ కాలేదని చెప్పడం అనైతికమన్నారు.

నియోజకవర్గంలోనే 269. 6 కోట్లు రుణమాఫీ

హుస్నాబాద్ నియోజకవర్గం లో 34,882 మంది రైతులకు 269.6 కోట్లు రుణమాఫీ జరిగిందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో లక్ష రూపాయల రుణమాఫీ 18,260 మందికి జరగగా 96 కోట్ల 26 లక్షల రూపాయలు విడుదల కోడడం జరిగిందని, రెండవ దశలో 1,50,000 వరకు రుణమాఫీ ఉన్న 9436 మంది రైతులకు 87.36 కోట్లు విడుదల అయ్యాయని, మూడవ దశలో రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ ఉన్నవారు 7136 మంది రైతులకు 87.6 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. హుస్నాబాద్ సింగిల్విండోలో 4,000 మంది సభ్యులు ఉంటే 900 మంది మాత్రమే అప్పు తీసుకున్నారని 70 శాతం కు పైగా రుణమాఫీ కావడం జరిగిందని తెలిపారు. 2005 -06 లో దేశంలో ఉన్న ప్రతి రైతుకు మొదటిసారి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి 2023 లో రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. త్వరలోనే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు.

ఆర్టీసీ నష్టాల నుండి క్రమంగా మెరుగుపడుతుంది

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఆడిపోసుకున్నాయని, ఆటో కార్మికులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల నుండి క్రమంగా గట్టెక్కుతుందని ఆర్టీసీ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రాఖీ పండుగ రోజు 64 లక్షల మంది ప్రయాణం చేశారని, టికెట్ ద్వారా 17 కోట్ల ఆదాయం సమకూరిందని అన్నారు.

కేసీఆర్ ట్యూనింగ్.. కిషన్ రెడ్డి మ్యూజిక్

పదేళ్లు అధికారంలో ఉన్న రెండు పార్టీలు రాష్ట్రానికి దేశానికి ఏం చేశాయో చెప్పాలని, కేసీఆర్ ట్యూనింగ్.. కిషన్ రెడ్డి మ్యూజిక్ వల్లే ఆ పార్టీలను ప్రజలు చులకన చేసి చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మీకు మీరే అవమానపరచుకున్నట్లు అని అన్నారు.

బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతాం

సెక్రటేరియట్ ముందు ఎవరి విగ్రహం తొలగించలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కానీ కేటీఆర్ ఆయన విగ్రహం పెట్టాలనుకుంటున్నారో ఏమో అందుకే మతితప్పి మాట్లాడుతున్నాడన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడలని, ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు. టెక్నాలజీని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లి, ఓటు హక్కు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేస్తూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఆనాడు వారు చేసిన పుణ్యఫలితమేనన్నారు. త్వరలో అట్టహాసంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బరాబర్ ప్రారంభించుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News