సంగారెడ్డిలో జోరుగా ఇసుక, మట్టి దందా
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధి కేంద్రంగా ఇసుక, మట్టి దందా జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మండలంలోని బ్యాతోల్ గ్రామ శివారుతో పాటు బ్యాతోల్ తాండా, ఎర్దానుర్ గ్రామాల పరిధిలో
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధి కేంద్రంగా ఇసుక, మట్టి దందా జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మండలంలోని బ్యాతోల్ గ్రామ శివారుతో పాటు బ్యాతోల్ తాండా, ఎర్దానుర్ గ్రామాల పరిధిలో ఈ అక్రమ ఇసుక, మట్టి మాఫియా వ్యాపారాన్ని గత కొంత కాలంగా కొనసాగిస్తున్నాయి. ఓవైపు రెవెన్యూ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి కేసులు చేస్తున్నప్పటికీ దందా మాత్రం ఇంకా కొనసాగుతుండటం విడ్డూరం. గత రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏరియా పరిధిలోనే మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి.
రెండు నెలల్లో ఏడు కేసులు.
కంది మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామంతో పాటు ఆ తండా పరిధిలో జనవరి 26న రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే గత నెలలో ఫిబ్రవరి 24న అక్రమంగా మట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఒక జేసీబీతో పాటు, మరో డంపర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తాజాగా ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటకు మట్టిని తరలిస్తున్న ఒక డంపర్ వాహనాన్ని సీజ్ చేసి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఈ అక్రమ ఇసుక, మట్టి తరలింపు వ్యవహారంలో రెవెన్యూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా, పూర్తిస్థాయిలో వీటిని అరికట్టలేకపోతున్నారు. ఓ వైపు కేసులు నమోదు చేసుకున్నప్పటికీ కొందరు వ్యక్తులు తమకేమి పట్టనట్లు జోరుగా అర్ధరాత్రిలో అక్రమ ఇసుక, మట్టి దందాను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఈ అక్రమ దందా వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనిపెట్టి వీటిని పూర్తిస్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.