దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. రుణ మాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే అని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫొటోతో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో తో కూడిన ఫ్లెక్సీ వేసే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని సదరు ఫ్లెక్సీని తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ఒకానొక సందర్భంలో ఫ్లెక్సీని తొలగించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటా పోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొడవ సద్దు మనగ పోవడంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపిన కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుల హాల్ చల్ చేశారు. క్యాంప్ ఆఫీస్ లోకి చొరబడి మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫ్లెక్సీని చింపి వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తదనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పట్టణంలో భారీ బందోబస్తు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య నెలకున్న ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల సమక్షంలో ధ్వంసం : ఎమ్మెల్యే హరీష్ రావు
ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అన్నారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.