తెలంగాణ పోలీస్ దేశానికి ఆదర్శం : మంత్రి హరీష్ రావు
తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు.
అత్యధిక టెక్నాలజీతో నేరాల నియంత్రణ
దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. శాంతి భద్రతలు పటిష్టంగా అమలైనప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఆధునికరించబడిందన్నారు.
అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ దేశానికి ఆదర్శం నిలిచిందన్నారు. దేశ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ పోలీసింగ్ పై చర్చ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేగంగా పారదర్శకంగా పాస్ పోర్ట్ ల జారీలో తెలంగాణ రాష్ట్రం ఏనమిదేళ్లుగా దేశస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాలో కమిషనరేట్ ఏర్పాటుతో పాటు సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో పోలీసులకు హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పథకాలను మంత్రి చేతుల మీదుగా బహుకరించారు.
అంతకు ముందు జిల్లా కేంద్రంలో పోలీసులు వారి వాహన శ్రేణితో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మంత్రి హరీష్ రావు, పోలీస్ కమిషనర్ శ్వేత, జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వాడితల సతీష్ బాబు, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, సుధా చైర్మన్ మారేడు రవీందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.