అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందని ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
పద్నాలుగేళ్ల పోరాటం.. తొమ్మిదేళ్ల సంకల్పంతో సర్వతోముఖాభివృద్ధి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందని ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ధి ఉత్సవ వేడుకలను పురస్కరించుకొని రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమర వీరుల స్థూపానికి, ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి హరీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలో పద్నాలుగేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో నేడు తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో పాలనాపరమైన సంస్కరణలతో ప్రజాప్రయోజనాలకు మరింత ఊతమిచ్చినట్లయిందన్నారు. గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా జిల్లాలో రంగనాయకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ల ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి గ్రామాలల్లో దుర్బిక్షాన్ని పారదొలినట్లుగా పేర్కొన్నారు.
ఈ ఏడు జిల్లాలో 7.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడే ఇందుకు నిదర్శనమన్నారు. రైతు బంధు, రైతుబీమా అమలుతో పాటుగా రైతులు పండించిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా నేడు 2.18 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గొల్ల, కుర్మలకు రెండో విడతలో 17వేల మందికి గొర్రెలను పంపిణీ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
మత్య్సకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, చేపల అమ్మకం యూనిట్లు అందజేశామని తెలపారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో 263.78 కోట్ల చేప పిల్లల పెంపకం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. జిల్లాలో లక్ష 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 26 గోదాంలను నిర్మించుకోవడంతో పాటగా సిద్దిపేటలో మోడల్ రైతు బజార్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గజ్వేల్‌లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
దీనికి తోడు పెరుగుతున్న జనాభా అనుగుణంగా రూ.25 కోట్లతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో రూ.665 కోట్లతో పరిశ్రమలు స్థాపించి 23వేల మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్థానిక యువతకు సాప్ట్ వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా రూ.52 కోట్ల ఐటీ టవర్ నిర్మించుకొని ప్రారంభానికి సిద్దం చేసుకున్నట్లు తెలిపారు. స్వంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం త్వరలోనే గృహలక్ష్మీ పథకం ద్వారా రూ.3లక్షల సహాయాన్ని ప్రభుత్వం తరుపున అందజేస్తామన్నారు.
స్వరాష్ట్రం లో పల్లెలు సర్వతోముఖాభివృద్ది సాధించాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో జిల్లాలోని 499 గ్రామాలు అగ్రస్థానం దక్కించుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీలల్లో భూగర్బ డ్రైనేజీ పనులు తుదిదశకు చేరుకోగా, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. హరితహారంతో జిల్లాలో 13.7 శాతానికి పచ్చదనం విస్తరించిందన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి , జాతీయ రహదారుల నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మారనున్నాయన్నారు.
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రుతుప్రేమ కార్యక్రమాన్ని మన సిద్దిపేటలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పేదలకు కార్పొరేట్ వద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ అసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. విద్యా, విద్యుత్, పర్యటక, శాంతి భద్రతల రంగాలల్లో జిల్లా ఘననీయమైన అభివృద్ధి సాధించినట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. అదే విధంగా అమరవీరుల కుంటుంబ సభ్యులను మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read..