సంగారెడ్డిలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ
నూతన విద్యా విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని...Teachers Rally at Sangareddy
దిశ, సంగారెడ్డి: నూతన విద్యా విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. శనివారం యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా 5వ మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు స్థానిక రాజీవ్ పార్క్ నుండి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిందిపోయి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ని తీసుకువస్తుందని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా సాచివేత ధోరణిని ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని కుంటుపరిచే ప్రయత్నం చేస్తుందని వాపోయారు.
రాబోయే కాలంలో ఇది ఇలాగే కొనసాగితే ఉద్యమం ద్వారా మాత్రమే సమస్యలు సాధించవలసిన అవసరం ఉందన్నారు. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడానికి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్త టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయాల్లో టైం టేబుల్ సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు కె. అశోక్, ప్రధాన కార్యదర్శి బి. సాయిలు, కోశాధికారి పి. శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జ్ఞానమంజరి, అమరేశ్వరి, జె. కాశీనాథ్, సుదర్శన్, జిల్లా కార్యదర్శి డి. సాయితేజ, ఎం. నరసయ్య, శ్యామ్, నరేష్, కృష్ణమూర్తి, అనురాధ, సీహెచ్. కృష్ణంరాజు, చందర్ రాథోడ్ నాయకులు ఎం, విజయనంద్ సింహాచలం, హరి సింగ్, జ్యోతి లింగం, దేవేందర్, సురేష్, శ్యాంప్రసాద్, సంతోష్ కుమార్, కృష్ణమూర్తి, ఏం. సుచరిత, సర్దార్, జ్యోతి, స్వప్న, అరుణ, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.