మా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తీసుకెళ్లండి
ఆకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని, రోజుల తరబడి ధాన్యాన్ని తీసుకేళ్లేందుకు లారీ కోసం ఎదురుచూడాల్సి వస్తుందని, ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిరసిస్తూ రైతుల జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
ధాన్యం అమ్మినా.. నెలల తరబడి కల్లాలోనే కాపలా
అందోలు, జోగిపేటలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా
అందోలులో ధాన్యం తగలబెట్టి రైతుల నిరసన
జోగిపేటలో రోడ్డుపై వెళ్తున్న లారీలను అడ్డుకున్న రైతులు
దిశ, అందోల్ : ఆకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని, రోజుల తరబడి ధాన్యాన్ని తీసుకేళ్లేందుకు లారీ కోసం ఎదురుచూడాల్సి వస్తుందని, ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిరసిస్తూ రైతుల జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మంగళవారం అందోలు సోసైటీ కార్యాలయం ఎదుట, జోగిపేటలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట వేర్వేరుగా అన్నదాతలు రెండు చోట్లలో జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారుగా గంటకు పైగా జాతీయ రహదారిపై రాస్తారోకోతో, ఇరువైపుల వాహనాలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తీసుకెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ధాన్యం తూకం వేసి పది రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ లారీలను కేంద్రాలకు పంపకపోవడంతో ధాన్యం కోసం రేయింబవళ్లు కాపలాగా ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తా బరువు 41.300 కిలోలు ఉంచాలని, ఇందులో నుంచి తూకంగా 1 కిలో 300 గ్రాముల ధాన్యాన్ని తరుగు తీయాల్సి ఉంటుంది.
కానీ, ఇందుకు విరుద్ధంగా తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు 2.50 కిలోల తరుగును తీస్తున్నారని, అంటే సుమారుగా క్వింటాలు ధాన్యానికి ఆరు కిలోల తరుగు తీస్తున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యం నుంచి రైస్ మిల్లర్లు లారీ మొత్తానికి 4 నుంచి 5 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు విధిస్తున్నారని వారు తెలిపారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కాకపోతే తమకు డబ్బులు ఇంకేప్పుడు వస్తాయంటూ వారు ఆవేదనను వ్యక్తం చేశారు. రైతులు చేపడుతున్న ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీ.వెంకటేశం, గోహెర్ అలీ, సీపీఎం నాయకుడు విద్యాసాగర్‌లు నిలిచారు.
అందోల్ లో ధాన్యం తగులబెట్టిన రైతులు..
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, తూకంలో జాప్యం చేయడం, రైస్ మిల్లులకు పంపించడంలో నిర్లక్ష్యం వహించడంతో విసుగు చెందిన అన్నదాతలు ధాన్యాన్ని జాతీయ రహదారిపై తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జోగిపేట ఎస్‌ఐ సామ్యానాయక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్‌కు ఫోన్‌లో మాట్లాడి లారీలను త్వరగా కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకొవాలని తెలిపారు. దీంతో రైతుల ధర్నాను విరమించడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
జోగిపేటలో లారీలను అడ్డుకున్న అన్నదాతలు..
అందోలు మండల పరిధిలోని పోసానిపేటకు చెందిన రైతులు జోగిపేటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రహదారిపై వస్తున్న రెండు లారీలను రైతులు అడ్డుకున్నారు. ఈ లారీలను తమ గ్రామానికి పంపించాలని, తమ ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపిస్తామని, అక్కడే ఉన్న తహసీల్దార్ వెంకటేశం, ఉప తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, ఎస్‌ఐ సామ్యానాయక్‌లను కొరారు. లారీలో రైతులు కూర్చొవడంతో తమ గ్రామానికి రావాలని డ్రైవర్‌ను అడుగగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటచేసుకుంది.
అధికారులు కూడా డ్రైవర్‌కు నచ్చజెప్పి, లారీ ఓనర్‌ను అక్కడికి పిలిపించి మాట్లాడారు. లారీకి సంబంధించిన కిరాయిని తాము చెల్లిస్తామని, ఓనర్‌కు నచ్చజేప్పడంతో లారీని పంపించేందుకు అంగీకరించాడు. దీంతో ఆ లారీని రైతులు గ్రామానికి తీసుకెళ్లారు. లారీ లోడ్‌ను రైస్ మిల్లర్లు ఆన్‌లోడ్ చేయకపోవడంతో ఈ సమస్య వస్తుందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళ్లి, రైతులకు ఏలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని తహసీల్దార్ వెంకటేశం తెలిపారు.