సైబర్ మోసగాడికి చిక్కిన విద్యార్థి… ఖాతా నుంచి రూ. 28 వేలు మాయం
ఓ కాలేజీ విద్యార్థికి చెందిన ఖాతా నుంచి సైబర్ నేరస్తులు రూ.28 వేలను కొట్టేసిన సంఘటన చోటు చేసుకుంది.
దిశ, నర్సాపూర్ : ఓ కాలేజీ విద్యార్థికి చెందిన ఖాతా నుంచి సైబర్ నేరస్తులు రూ.28 వేలను కొట్టేసిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా జుక్కల్ కు చెందిన గడ్డం బాలయోగి నర్సాపూర్ పట్టణంలో నివాసం ఉంటూ బి వి ఆర్ ఐ టి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నవంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ మెసేజ్ రాగ అందులో లింక్ ఓపెన్ చేయగానే టెలిగ్రామ్ ఓపెన్ అయ్యింది. అందులో మెసేజ్ చేయగా, వారు రెస్టారెంట్ కి రేటింగ్, రివ్యూ ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని మెసేజ్ చేశారు. దాంతో విద్యార్థి గడ్డం బాలయోగి రేటింగ్స్ కోసం మెసేజ్ చేయగా కొంత డబ్బు వచ్చింది. మరలా టెలిగ్రామ్ యాప్ నుంచి అతనికి డబ్బులు రాగా ఇలా పలుమార్లు సైబర్ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ. 28,500 రూపాయలు కొట్టేశారు. ఆ డబ్బులు తిరిగి రాకపోయేసరికి సైబర్ క్రైమ్ వాళ్లకి కంప్లైంట్ చేశారు. గడ్డం బాలయోగి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ ఎస్సై లింగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.