నేరాలు 5 శాతం పెరిగాయి : పోలీసు కమిషనర్ అనురాధ
గత ఏడాదితో పోల్చితే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 5 శాతం నేరాలు పెరిగాయి. ఈమేరకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ విడుదల చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : గత ఏడాదితో పోల్చితే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 5 శాతం నేరాలు పెరిగాయి. ఈమేరకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ విడుదల చేశారు. గత సంవత్సరంలో 5931 కేసులు నమోదు కాగా 2024 లో 6233 కేసులు నమోదు కాగా 5శాతం నేరాలు పెరిగాయి. 2024 లో 25 మర్డర్ కేసులు, 91 ఫోక్సో కేసులు, 75 రేప్ కేసులు, 40 గంజాయి కేసులు నమోదు అయ్యాయి. కమిషనరేట్ పరిధిలో గత ఏడాది నమోదైన కేసుల్లో నేరస్తులకు 47 శాతం శిక్షలు విధించగా, ఈ ఏడు 48 శాతం శిక్షలు విధించడం జరిగింది.
ఆందోళన కలిగిస్తున్న చోరీలు..
జిల్లాలో చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దొంగతనాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లో పెరగడం గమనార్హం. 2023 లో అన్ని రకాల చోరీలు 679 చేటు చేసుకోగా, ఈ ఏడాదిలో 709 చోరీలు జరిగాయి. ఈ ఏడాదిలో చోరీల ద్వారా రూ 31,097,968 కోట్ల ఆస్తీ కోల్పోగా 40 శాతం రికవరీ చేశారు. గతేడాది కంటే 3 శాతం రికవరీ తగ్గింది. 2023లో 5 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 9 కేసులు నమోదు అయ్యాయి.
655 రోడ్డు ప్రమాదాలు...283 మంది ప్రాణాలు కోల్పోయారు
జిల్లాలో నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతున్న ఆగడం లేదు. ప్రమాదాల్లో మృతుల కంటే క్షతగాత్రులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాదిలో 655 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 283 మంది ప్రాణాలు కోల్పోయారు. 561 మంది గాయపడ్డారు. పోలీసుల వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతూ జరిమానాలు విధిస్తున్నారు. 2023 లో డ్రంక్ అండ్ డ్రైవ్ 9713 కేసులు నమోదు కాగా 28 మందికి జైలు శిక్ష విధించారు. 2024 లో డ్రంక్ అండ్ డ్రైవ్ 12,681 కేసులు నమోదైతే 45 మందికి జైలు శిక్ష విధించారు. ఏడాది రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా 43,594 కేసులు నమోదు చేసి రూ.45,076,390 విధించారు. ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపిన వాహనదారులపై 3,45,816 కేసులు నమోదు చేశారు.
219 ఇసుక అక్రమ రవాణా కేసులు
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై 2024లో 219 కేసులు నమోదు చేసి 412 మందిని అరెస్టు చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఈ సంవత్సరం రేషన్ బియ్యం అక్రమంగా దాచిపెట్టిన రవాణా చేసిన వారిపై 145 కేసులు నమోదు అయ్యాయి.
నేరం ఏదైనా కేసు నమోదు
చిన్న నేరమైనా కేసులు నమోదు చేయడంతో గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 2023 సంవత్సరంలో 5931 కేసులు నమోదైతే, ఈ ఏడాదిలో 6233 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 5శాతం కేసులు పెరిగాయని పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. 2024 లో క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కేసులు 562, సైబర్ నేరాలు 199, పేకాట జూదం అడిన వారిపై 80 కేసులు, ఈ పెట్టి కేసులు 3,150, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 1421 కేసులు, నిషేధిత గుట్క అమ్మిన వారిపై 32 కేసులు, నకిలీ విత్తనాలు 3 కేసులు, బెల్ట్ షాపుల పై రెట్ చేసి 404 కేసులు నమోదు అయ్యాయి. సీఈఐఆర్ టెక్నాలజీతో 1369 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగించారు. జాతీయ మెగా లోక్ అదాలత్ లో ఈ సంవత్సరం 21,249 కేసులు పరిష్కారం జరిగింది.
మత్తు రహిత జిల్లాగా మారుస్తాం : పోలీసు కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తామని పోలీసు కమిషనర్ డాక్టర్ బీ అనురాధ స్పష్టం చేశారు. మహిళలకు బాలికలకు సంబంధించిన కుటుంబ సమస్యలను, కేసులను ఒకే దగ్గర పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సైబర్ నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.