పల్లె రోడ్లకు మహర్దశ.. మంత్రి హరీశ్ రావు
కేసీఆర్ పాలనలో పల్లెల్లోని రోడ్లకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కేసీఆర్ పాలనలో పల్లెల్లోని రోడ్లకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండలంలోని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.14 కోట్ల 55 లక్షల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నారాయణరావుపేట మండల కేంద్రం నుండి గోపులాపూర్ వరకు 4 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్ల 99 లక్షలు, నారాయణ రావు పేట మండల కేంద్రం మల్యాల వరకు 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 27లక్షలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు.
అలాగే గుర్రాల గొంది గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అలయానికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.కోటి 5లక్షలు, బంజేరుపల్లి రోడ్డు నుండి బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయం వరకు 1.5 కీ.మీ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. కోటి 50లక్షలు మంజూరైనట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీటీ రోడ్ల నిర్మాణంతో అయా గ్రామాలకు ప్రయాణం సులభతరం కానుందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరగా పనులు చేపట్టి బీటీరోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు అదేశించారు.