పొద్దుపొద్దున్నే టీఆర్ఎస్‌కు మరో భారీ షాక్...

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల...Shocking News for TRS

Update: 2022-12-03 02:03 GMT

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల సహకార యూనియన్ మాజీ చైర్మన్, గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపు మల్ శెట్టి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నారాయణఖేడ్ లో విలేకరులతో వివరాలు వెల్లడించారు. తాను తెలంగాణ పోరాటంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముందుండి పని చేశానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ హై కమాండ్ జారీ చేసిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యత్నించామని అన్నారు. ఓడిపోతానని తెలిసినప్పటికీ జడ్పీటీసీగా పోటీ చేసి ప్రజలను చైతన్య పరచామని తెలిపారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మాట తప్పడంతో అనేక ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలు జరిపి జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన తాను గొర్రెల, మేకల పెంపకం దారుల సహకార యూనియన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా పనిచేసి వందలాది కుటుంబాలకు గొర్రెలను అందించామని తెలిపారు.


దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో 2016లో వచ్చిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన మహారెడ్డి భూపాల్ రెడ్డిని గెలిపించేందుకు విశేషంగా కృషి చేశామన్నారు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి తమను తీవ్రంగా అవమానపరిచారని ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే వెంట తెలంగాణ ఉద్యమకారులు లేరని పూర్తిగా ఉద్యమ ద్రోహులు ఉన్నారని విమర్శించారు. ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాబోవు రోజుల్లో అనుచరులతో సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆయన వెంట నాయకులు గోవింద్ యాదవ్, విఠలాచారి, బాబురావు పాటిల్, అమృత్, రామన్న, పండరి, లక్ష్మణ్, బల్ భీం, శ్యామ్, గణపతి, బిందాస్, తుకారం, జైపాల్, శరణప్ప, శ్రీకాంత్, సామెల్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News