సర్వాయి పాపన్న బహుజన రాజుః మాజీ మంత్రి హరీష్‌ రావు

Update: 2024-08-18 10:03 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి/ నంగునూరు : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దంలో బహుజన రాజుగా ఉన్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి హరీష్ రావు పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ లెక్క జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా చేయాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కల్లు డిపోల మీద దాడులు, అక్రమ కేసులు పెట్టి గీత కార్మికులను వేధించడం దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నంగునూరు మండలం కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు.

Tags:    

Similar News