కేతకిలో కలెక్టర్ దంపతుల పూజలు...

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో...Sangareddy Collector preforms pooja at Sangameshwara temple

Update: 2023-02-19 06:30 GMT

దిశ, ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని అర్ధరాత్రి జాగరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి పుష్కరిణి, అమృతగుండంలో జల లింగానికి పూజలు నిర్వహించి గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు, అధికారులు, వేద మంత్రోచ్ఛనల మధ్య పూలమాల, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మొగుడంపల్లి జడ్పీటీసీ సభ్యులు అరుణామోహన్ రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.




ఘనంగా పల్లకి సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 4:00 కు నిత్య పూజల అనంతరం శ్రీ పార్వతి సమేత సంగమేశ్వర స్వామి వారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యపూజల అనంతరం స్వామి వారి పల్లకి సేవ ప్రారంభించారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఝరాసంగంకు చెందిన గౌరీ శంకర్ వేసిన దండకాలతో భక్తులు మంత్రముగ్ధులు అయ్యారు. మాడవీధుల్లో ఊరేగుతున్న సంగమేశ్వర స్వామి వారికి భక్తులు మంగళ హారతులు, కలశములతో ఘనంగా స్వాగతం పలికారు. కాగా బ్రహ్మోత్సవాలను ఇప్పటివరకు 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. 



Tags:    

Similar News