రేవంత్ పరిపాలన అదుపు తప్పింది : హరీష్ రావు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై

Update: 2024-10-08 13:52 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారెంటీ అన్నాడు కానీ అది గోల్ మాల్, గోబెల్స్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ పరిపాలన అదుపు తప్పింది గాడి తప్పింది..హైడ్రా వల్ల హైదరాబాద్ కళ తప్పింది..⁠రాజకీయ భాష పట్టు తప్పింది..⁠అవినీతి అదుపు తప్పింది..⁠పరిపాలన గాడి తప్పింది.. రియల్ ఎస్టేట్ కుదేలైంది..మొత్తంగా తెలంగాణ బతుకు బండి పట్టాలు తప్పిదన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్ల కు జీతాలు పెండింగ్ లో ఉండటం వల్ల బతుకమ్మ దసరా పండుగ సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

10 నెలలుగా పోలీసులకు టీఎ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లు చెల్లించడం లేదన్నారు. హోంగార్డులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం లేదన్నారు. వీఓఏలు, ఆర్పీ లకు 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ లల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు, సెకండ్ ఏఎన్ఎం లకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4వేలు పెంపు దేవుడు ఎరుగు ఇచ్చే 2 వేలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మూసీ సుందరీకరణ కోసం లక్ష యాబై వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం చిరు ఉద్యోగులకు వేతనాలు, వృద్ధాప్య పెన్షన్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్ల కు జీతాలు, రైతు భరోసా ఇవ్వకుండా పేద ప్రజలపై పండగ పూట ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, పంచాయతీ సెక్రటరీల బిల్లులు, చిన్న ఉద్యోగుల జీతాలు, చిన్న కాంట్రాక్టర్స్ కి ప్రాధాన్యత క్రమంలో బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు, నాలుగువేల నిరుద్యోగ భృతి, అన్ని పంటలకు బోనస్ అన్న కాంగ్రెస్ బోగస్ మాటలు ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై గ్రామాల్లో చర్చించాలని కోరారు. పంటలు చేతికి వచ్చిన పంట పెట్టుబడి సాయం అందలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగం అయి లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డగా.. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలయ్యారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో చిన్న పాటి మందులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు నీళ్ల చారు తో అన్నం తింటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.


Similar News