దిశ కథనానికి స్పందన.. శిల్ప అక్రమాలు వెలుగులోకి..

సదాశివపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లిలోని నల్లవాగు ఆక్రమణ జరిగిందంటూ దిశ వరుస కథనాలు వెలువరించడంతో శిల్ప అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-09-11 17:12 GMT

దిశ, సంగారెడ్డి : సదాశివపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లిలోని నల్లవాగు ఆక్రమణ జరిగిందంటూ దిశ వరుస కథనాలు వెలువరించడంతో శిల్ప అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నల్లవాగు విస్తీర్ణం 20 మీటర్లు, భపర్ జోన్ మరో 18 మీటర్లు ఉండగా శిల్ప వెంచర్ దానిని ఆక్రమించి కేవలం మీటరున్నర వెడల్పుతో రాతి కట్టడం నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షానికి భారీ ఎత్తున వరద ప్రభావం రావడంతో వెంచర్ నుంచి నేషనల్ హైవే పైకి నీరు వచ్చింది. శిల్ప వెంచర్ పూర్తిగా జలదిగ్బందంలో చిక్కుకుంది. గతం నుంచి కూడా నల్లవాగు ఆక్రమణ జరిగిందంటూ దిశ వరుస కథనాలు ప్రచురించడంతో ఆ కథనాలు నిజమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు నల్లవాగు విస్తీర్ణం 20 మీటర్లు, బఫర్ జోన్ మరో 18 మీటర్లు ఉంటుందని తేల్చారు.

దిశ కథనం పై కలెక్టర్ ..

నల్లవాగు ఆక్రమించి రంగురంగుల పార్కులు ఏర్పాటు చేశారంటూ దిశ వెలువరించిన కథనం నిజమయ్యింది. వర్షాలకు నీరు మొత్తం నేషనల్ హైవే పైకి రావడంతో కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారుల పై సీరియస్ అయ్యారు. బుధవారం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించి శిల్ప వెంచర్ అక్రమాల పై విచారణ జరుపాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు శిల్ప వెంచర్ కు చేరుకుని నల్లవాగు విస్తీర్ణాన్ని సర్వే చేశారు. శిల్పా వెంచర్ వాగును ఆక్రమించింది నిజమని తేల్చారు. వెంచర్ నుంచి పారుతున్న నల్లవాగును మీటరున్నరకు కుదించడం వల్లే అధిక వర్షాల వల్ల నీరు రోడ్లపైకి వచ్చిందన్నారు. దీంతో వెంచర్ యజమానులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మా భూమి కొందరు ఆక్రమించుకుని మా భూమిలో నుంచి కాలువ వెళ్లేలా మరల్చారని, పూర్తిగా కాలువ పారకం ఏవిధంగా ఉందో ఆ విధంగా సర్వే చేయాలన్నారు. అధికారులు యాజమాన్యంతో మీరు నల్లవాగును ఎందుకు ఆక్రమించారని, 20 మీటర్లు ఉన్న నల్లవాగును ఎందుకు మీటరున్నరకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగును ఆక్రమించడం వల్లనే నీరు రోడ్డుపైకి వచ్చి వెంచర్ పూర్తిగా మునిగిపోయిందన్నారు. తప్పనిసరిగా 20 మీటర్లు వాగు, బఫర్ జోన్ 18 మీటర్లు ఉండేలా హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు.

తూతూ మంత్రంగా అధికారుల సర్వే..

కలెక్టర్ ఆదేశాలతో శిల్పా వెంచర్ లో సర్వే చేసేందుకు సదాశివపేట తహసీల్దార్ సరస్వతి, ఇరిగేషన్ డీఈ బాలగణేష్, ఏఈ మహేష్, ఆర్.ఐ గంగాధర్ లు వచ్చారు. కాలువను ఎలా ఆక్రమిస్తారంటూ, వాగును ఆక్రమించడం వల్లే నేషనల్ హైవే పైకి నీరు వచ్చి ఇబ్బందులు ఏర్పడ్డాయని ఇరిగేషన్ ఏఈ మహేష్ వెంచర్ యాజమాన్యాన్ని అడగగా వారు అధికారుల పై సీరియస్ అయ్యారు. 20 మీటర్ల వాగును మీటరున్నరకే ఉంచి రాతి కట్టడం ఎలా కడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏఈకి వెంచర్ యాజమాన్యానికి వాదోపవాదాలు జరిగాయి. ఓ వైపు గొడవ జరుగుతుండగానే సర్వే నిర్వహించేందుకు వచ్చిన సదాశివపేట తహసీల్దార్ సర్వే ప్రారంభం కాకుండానే వెళ్లిపోయారు.

కలెక్టర్ సర్వే చేయాలని ఆదేశించిన కూడా కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా మధ్యలో వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అధికారులు వెంచర్ లో తూతూ మంత్రంగా సర్వే నిర్వహించి కేవలం సెంటర్ పాయింట్ చేశామంటూ వెళ్లిపోయారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నల్లవాగు ఆక్రమణ ఎంత జరిగిందో తెలుస్తుంది. కానీ ఎటూ తేల్చకుండానే వెళ్లిపోయారు. ఎందుకు వచ్చారు..ఎందుకు వెళ్లారో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా నల్లవాగును ఆక్రమించిన వెంచర్ యాజమాన్యంపై అందుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్సాన్ పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News