MP Raghunandan Rao : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా లోని కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు.
దిశ, పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా లోని కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. శనివారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట పటేల్ గూడా లో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డిపేట పరిధిలోని దుర్గా నగర్, పటేల్ గూడా లోని బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్, సూర్యోదయ కాలనీ, సృజన లక్ష్మీ నగర్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు తమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. తాను ప్రచారానికి రాకపోయినా కిష్టారెడ్డిపేట పటేల్ గూడా పరిధిలోని కాలనీలో ప్రజలు తనపై అపార నమ్మకం ఉంచి ఓటు వేసి అత్యధిక మెజారిటీ కట్టబెట్టడం పట్ల కాలనీవాసులకు రుణపడి ఉంటానన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలు తన దృష్టికి రావడంతో స్వయంగా తాను పరిశీలిస్తున్నానన్నారు.
తనపై కాలనీవాసులు పెట్టుకున్న అపార నమ్మకాన్ని నిలబెట్టుకునేలా త్వరలో సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలలో ప్రధాన సమస్య అయిన తాగునీటి సరఫరా విషయమై ఇప్పటికే హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి. అశోక్ రెడ్డితో పలుమార్లు మాట్లాడడం జరిగిందని త్వరలో కాలనీలలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. అదేవిధంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న రహదారులు, డ్రైనేజ్ సమస్యకు అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొండా లక్ష్మణ్ తో పాటు ఆయన ఆధ్వర్యంలో పలువురు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేళ్లి రవీందర్, ఎడ్ల రమేష్, బీజేపీ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అమీన్ పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు తో పాటు బీజేపీ నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.