Tammineni Veerbhadram : ప్రపంచం ఎర్రజెండా వైపు చూస్తోంది

ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం తగ్గుముఖం పడుతోందని, అమెరికా, డాలర్‌ ఆధిపత్యాకి కళ్లెం వేస్తూ రష్యా కజానాలో జరిగిన ‘బ్రిక్స్‌ఫ్లస్‌’ శిఖరాగ్ర సమావేశం పలు కీలక ప్రకటనలు చేసిందని

Update: 2024-10-26 14:38 GMT

దిశ, సంగారెడ్డి : ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం తగ్గుముఖం పడుతోందని, అమెరికా, డాలర్‌ ఆధిపత్యాకి కళ్లెం వేస్తూ రష్యా కజానాలో జరిగిన ‘బ్రిక్స్‌ఫ్లస్‌’ శిఖరాగ్ర సమావేశం పలు కీలక ప్రకటనలు చేసిందని, దీనివల్ల ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని మాట్లాడుతూ… చైనా ఎలక్ట్రికల్‌ కార్లు ప్రపంచాల్ని ఆకర్షింస్తున్నాయని, చైనా ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నా చైనా వస్తువులు చౌకగా లభించే అవకాశాలే అధికంగా ఉన్నాయన్నారు.

అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న చైనాతో పాటు ఇటీవల ఫ్రాన్స్‌, శ్రీలంక ఎన్నికల్లో ఎర్రజెండా పార్టీలు విజయాలు సాధిస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు శిబిరాలు మరింత బలపడే అవకాశాలున్నాయన్నారు. భారత దేశంలో కూడా కమ్యూఁస్టులకు భవిష్యత్‌ ఉందా అనే తిరోగమన చర్చ కాకుండా కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్‌ లేదని స్పష్టం చేశారు. ప్రజల బతుకులు మార్చడానికి... జనం సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు చూపుతున్న విధానాలు ప్రత్యామ్నాయం తప్ప ఓట్లు, సీట్ల బలాబలాలు కాదని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలన ఇలానే సాగితే ఇండియా ఇలాగ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వ స్థాపనే బీజేపీ లక్ష్యమన్నారు. . తిరుగేలేదని విర్రవీగిన బీజేపీకి పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయన్నారు. విద్య, భూమి, ఉపాధి, సామాజిక న్యాయం, స్వయం పోషణ అందరికీ దక్కాలన్నదే కమ్యూనిస్టుల ప్రత్యామ్నాయ విధానమన్నారు.

కేసీఆర్‌ పట్ల ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఆ పార్టీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు తప్ప వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పనిచేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా మహాసభల్లో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, చుక్క రాములు, డీజీ నర్సింహరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జే.మల్లిఖార్జున్‌, జిల్లా కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, ఎ.మల్లేశం, మూడు జిల్లాల కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, బి.రామచంద్రం, అతిమేల మాణిక్యం, ఎం.నర్సింహులు, గోపాల స్వామి, శిశిధర్‌, ఎల్లయ్య, చంద్రారెడ్డి, నర్సమ్మ, మల్లేశం, బసవరాజు, లలిత పాల్గొన్నారు.


Similar News