మంజీరా పరవళ్ళు... భక్తుల పరవశం..

వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి.

Update: 2024-09-08 10:27 GMT

దిశ, పాపన్నపేట : వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. వనదుర్గమ్మ ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు, పర్యటకులు ఆయా ప్రాంతాల నుంచి ఏడుపాయలకు విచ్చేస్తున్నారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో ఏడుపాయలకు భక్తులు, పర్యాటకుల తాకిడి పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, ప్రధానంగా జంట నగరాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు వేకువజామునే వన దుర్గమ్మకు అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. పలువురు భక్తులు ఒడిబియ్యం, బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.


Similar News