మిరుదొడ్డిలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ ఆకస్మిక తనిఖీ
నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్ ను, ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్ ను నిర్వహిస్తున్నట్టు తరచూ జిల్లా కలెక్టర్
దిశ, మిరుదొడ్డి: నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్ ను, ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్ ను నిర్వహిస్తున్నట్టు తరచూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందడంతో సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రేవతి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ తో కలిసి మిరుదొడ్డి మండల కేంద్రంలోని మల్లికార్జున క్లినిక్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్టిఫికెట్ డాక్టర్ అంకయ్య పేరు మీద ఉండగా, వైద్యం మాత్రం మరొకరు చేస్తున్నారని గుర్తించారు. క్లినిక్ నిర్వహిస్తున్న వ్యక్తికి ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం వైద్యం చేయుటకు అనర్హుడు అని తెలిపారు.
దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారికి వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు, మల్లికార్జున క్లినిక్ పక్కనే నిర్వహిస్తున్న ల్యాబ్ కి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, ల్యాబ్ ను నిర్వహించే టెక్నీషియన్ సర్టిఫికెట్ కూడా ఎక్స్పైర్ కావడంతో ల్యాబ్ ను సీజ్ చేసినట్లు జిల్లా ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లు కానీ, ల్యాబ్ లు కానీ నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సమీనా, సుల్తాన్ పాల్గొన్నారు.