వర్షం మాటున కాలుష్యం.. మృత్యువాత పడుతున్న మూగజీవాలు..
వర్షం మాటున కాలుష్యం
దిశ, జిన్నారం : పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. కాలుష్య జలాలతో ఎన్నో ఘటనలు జరిగినా యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. పరిశ్రమల యాజమాన్యాలకు పీసీబీ అధికారులు తొత్తులుగా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్యంతో తీరని నష్టం జరుగుతున్నా అధికారులు సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో జిన్నారం మండలంలోని సుమారు 300 రసాయన పరిశ్రమలు ఉండగా పలు పరిశ్రమలు వర్షం నీటితో కలిపి కాలుష్య వ్యర్థ జలాలను బహిరంగంగా బయటకు వదిలేస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్యంగా మారుతున్నాయి. కాలుష్య జలాలను తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయినా యాజమాన్యాల తీరును ప్రశ్నించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. పీసీబీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాలుష్య జలాలను వదులుతున్నయాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు కోరుతున్నారు.
జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 300 రసాయన పరిశ్రమలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారీగా వ్యర్థ జలాలతో పాటు వాయు కాలుష్యం వెలువడుతుంది. జల, వాయు కాలుష్యాల నియంత్రణకు సంబంధిత యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్యలు ఏర్పాటు చేసేందుకు ఎక్కువగా ఖర్చు అవుతున్నది. కాలుష్య జలాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా యాజమాన్యాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు కాలుష్య జలాలను నిబంధనలకు విరుద్ధంగా యదేచ్ఛగా బయటకు వదిలేస్తున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. పారిశ్రామిక వాడల్లో గల మూగజీవాలు కాలుష్య జలాలు తాగి మృత్యువాత పడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని స్థానిక నాయకులు ఎన్నిసార్లు యాజమాన్యాలను కోరిన పట్టించుకోవడం లేదు.
పీసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం..
భారీ స్థాయిలో కాలుష్య జలాలు బయటకు వెలువడుతున్నా పీసీబీ అధికారులు మాత్రం ఇటువైపు చూడడం లేదు. కాలుష్య జలాల విషయంలో పారిశ్రామికవాడల ప్రజలు పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదు ఇచ్చిన సమయంలో నమూనాలను సేకరించి పరీక్షల పేరిట పీసీబీ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ ఈఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం ఇటువైపు కనబడడం లేదు.
మృత్యువాత పడుతున్న మూగజీవాలు..
కాలుష్య జలాలు సేవించిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. కిష్టాయిపల్లి గ్రామంలోని సాయి అనే రైతుకు చెందిన 16 గేదెలు వ్యర్థ జలాలు సేవించి మృతి చెందాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హైదరాబాదులోని పీసీబీ మెంబర్ సెక్రటరీ కార్యాలయం ఎదుట మృతి చెందిన గేదెలతో నిరసన తెలిపారు. అయినా ఇప్పటివరకు కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలను పీసీబీ అధికారులు గుర్తించలేదు. అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు ఎలా సహకరిస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి కాలుష్య జనాలను వదులుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వర్షం పడితే పండగే..
రసాయన పరిశ్రమల యాజమాన్యాలకు వర్షాలు కురిస్తే పండగే. వర్షం పడుతున్న సమయంలో కాలుష్య జలాలను వర్షం నీటితో కలిపి బయటకు వదిలేస్తున్నాయి. వర్షం పడుతున్న సమయంలో పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు పారిశ్రామిక వాడల్లో పర్యటించాల్సి ఉంటుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం ఇటువైపు రావడం లేదు. పీసీబీ అధికారుల కనుసన్నల్లోనే వ్యర్ధ జలాలను బయటకు వదిలే ప్రక్రియ కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య జలాలను వదులుతున్న సమయంలో స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదులు చేసిన వారు పట్టించుకోవడం లేదు. కాలుష్య జలాలను వదులుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు కోరుతున్నారు.