ఈ గ్రామ బ్యాంక్యులో డబ్బుల కొరత..
పెద్ద శంకరంపేట యూనియన్ బ్యాంకులో వినియోగదారులకు ఎదురవుతున్న సమాధానం డబ్బులు లేవు.
దిశ, పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట యూనియన్ బ్యాంకులో వినియోగదారులకు ఎదురవుతున్న సమాధానం డబ్బులు లేవు. ఈ సమాధానంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నిత్యం వివిధ రకాల లావాదేవీల కోసం బ్యాంకుకి వెళ్లాల్సి వస్తుందని బ్యాంకు సిబ్బంది ప్రవర్తనతో విసిగి పోతున్నాం అని వినియోగదారులు వాపోతున్నారు. చిన్న మొత్తాలను మినహాయించి 50 వేల పై చిలుకు డబ్బుల కోసం వెళితే బ్యాంకులో డబ్బులు లేవనే సమాధానం వినిపించడం పరిపాటిగా మారిపోయింది. డబ్బులు డ్రా చేయడానికి వెళితే ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. తమ తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి క్యాష్ కౌంటర్లో క్యాషియర్ కి చెక్ రూపంలో గాని, ఓచర్ రూపంలో గానీ ఇస్తే సదరు క్యాషియర్ ఆ ఓచరిని డబ్బులు లేవు అంటూ మొహం మీద కొట్టినంత పని చేస్తున్నాడని చాలా దురసుగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేకంగా క్యాషియర్ ప్రవర్తన పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నామన్నారు. కనీసం దీని కారణంగా బ్యాంకులో డబ్బులు లేవు కొంచెం వెయిట్ చేయండి. ఈ టైం వరకు ఇస్తాం లాంటి సమాధానం కూడా క్యాషియర్ చెప్పకుండా ఓచర్ ని మొహం మీద కొట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడని వినియోగదారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయమై మేనేజర్ దగ్గరికి వెళ్లి అడగగా ఆయన రేపు తీసుకోండి, లేదా వేరే ఎవరైనా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తామంటూ సమాధానం చెప్తున్నాడన్నారు. లేదు సార్ మాకు డబ్బులు అత్యవసరం అంటే సరే సాయంత్రం వరకు చూద్దాం అన్నట్టుగా సమాధానం ఇస్తున్నాడని వారు తెలిపారు. మా డబ్బులు మాకు ఇవ్వడంలో జాప్యం చేయడం ఒక ఎత్తయితే వారి ప్రవర్తన మరీ ఒక బిచ్చగాడిని డబ్బులు లేవు పో అని కసురుకున్నట్టుగా ఉందని వారు వాపోతున్నారు. నిత్యజీవితంలో నగదుతోనే తీర్చుకునే అవసరాలు ఎన్నో ఉంటాయి అని, అన్నింటికీ అకౌంట్ ట్రాన్స్ఫర్లతో పనులు జరగవు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఎంతో మంది ప్రజలు తమ తమ అవసరాల నిమిత్తం బ్యాంకుకి వస్తుంటారని బ్యాంకు సిబ్బంది తమ తీరు మార్చుకొని వినియోగదరులకి మంచి సేవలు అందించాలని వారు కోరుతున్నారు.