మూసీ సుందరీకరణ ఎవరిని ఉద్దరించేందుకు.. ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. ఇచ్చిన హామీ మేరకు అవ్వ తాతలకు పెన్షన్ పెంపు లేదు.. కళ్యాణ లక్ష్మీ తులం బంగారం లేదు..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. ఇచ్చిన హామీ మేరకు అవ్వ తాతలకు పెన్షన్ పెంపు లేదు.. కళ్యాణ లక్ష్మీ తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి, ఉద్యోగస్తుల ఊసే లేదు.. కానీ లక్షా 30 వేల కోట్ల రూపాయలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దరించడానికి మూసీ సుందరీకరణ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ సభ్యులకు యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హామీలను అమలు మరిచాడని మండిపడ్డారు. గ్రామాల్లో సగం మంది రైతులకు 2 లక్షల రుణ మాఫీ కాలేదు కానీ రాజీనామా ఎప్పుడు చేస్తావని సీఎం మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దితే.. పది నెలల కాంగ్రెస్ పాలనలో ఆగం చేస్తున్నారన్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా పేరిట 25 వేల ఇండ్లను కూలిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చేపట్టిన కూల్చివేతలతో ఎన్నో ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేద ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కఠినాత్ముడు అని మండిపడ్డారు. ఆటో కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినా, నిరసన తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చనిపోయిన ఆటో కార్మికులకు రూ.5 లక్షల నష్టపరిహారం, ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అసెంబ్లీ వేదికగా ఆటో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆటో కార్మికులను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షుడు పాల సాయిరాం, నాయకులు కడవేర్గు రాజనర్సు, కొండం సంపత్ రెడ్డి, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.