దిశ, సిద్దిపేట: బీజేపీ వైఖరి గిల్లీకజ్జాలు, కొట్లాటతో అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైతదన్న రీతిలో తప్పుడు ప్రచారం చేయడం అనేది బీజీపీకి అలవాటుగా మారిందని దీనిని ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ అధ్యక్ష్యలు బాధ్యత తీసుకుని, యువతకు, ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయిలో వివరించాల్సిన బాధ్యత పార్టీ అద్యక్షులుగా చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి మంత్రి క్యాంపు కార్యాలయంలో నారాయణ రావు పేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు..
గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు ఓ వైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. మరోవైపు బీజేపీ చేసే దుష్ప్రచారం, తిప్పికొట్టాల్సిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని పార్టీ శ్రేణులను కోరారు. తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకతను చెప్పకనే ప్రధాని మోడీ చెప్పారని, 1997లో బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని తీర్మాణం చేసి, అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వనిది కూడా బీజేపీనేనని అన్నారు.
కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే తెలంగాణకు లాభం, ఆంధ్రాకు నష్టమైందని ధోరణిలో మాట్లాడటం సరికాదు. ప్రధాన మంత్రి అయిన తర్వాత మొదటి రోజున 7 మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించి తెలంగాణకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అవకాశం వచ్చిన ప్రతీసారి పార్లమెంటులో 4, 5 సార్లు విభజన సరిగ్గా జరగలేదని.. మనపై ఆక్రోశం వ్యతిరేకతను వెల్లిబుచ్చుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ సవరణ చేయాలని, ఎందు కోసమంటే దళితులకు, గిరిజనులకు మరింత రక్షణ కావాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారని, భవిష్యత్తులో బీసీలకు, మహిళలకు రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు లేకుండా పోతున్నాయని.. వారందరికీ నష్టం జరుగుతుందని చెప్పినట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల జనాభా 40 శాతం ఉంటే బడ్జెట్‌లో 12800 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు.
జనాభా ప్రాతిపాదికన నిధులు పెంచాలని, బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ తేవాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, ఆంధ్ర విశాఖ ఉక్కు అమ్మేశారని, బీహెచ్ఈఎల్, బీడీఎల్ అమ్మకానికి పెడుతున్నారని, బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు తీసేశారని, రైలు ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. ఇదంతా వదిలి తిరిగి మన టీఆర్ఎస్ పై బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇవన్నీ వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియపర్చాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు.
తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టిన కేంద్రం..
తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సంక్షేమ పథకాలను కాపీ కొట్టారని, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఇప్పటిదాకా 10 లక్షలు ఆడపిల్లల పెళ్ళిలకు 8,300 కోట్లు ఆర్థిక సాయం చేశామని దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదని ధీమాగా చెప్పాలని కోరారు. ఇంటింటికీ మంచినీరు, రైతుబంధు, మిషన్ భగీరథ, ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో గెలిస్తే ఉచిత కరెంటు ఇస్తామని కూడా కాపీ కొట్టారన్నారు. కానీ తెలంగాణకు చేసిందేమీ లేకున్నా.. ఫేక్ ప్రచారం కొనసాగిస్తున్న తీరును తిప్పి కొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
విభజన చట్టంలో చెప్పిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ ప్రాజెక్టు, వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఇలా ఏదీ ఇవ్వలేదని వివరించి.. మనపైనే విషం చిమ్మడం, బురద చల్లడం ఓ రకమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. బీజేపీ వైఖరి గిల్లీకజ్జాలు, కొట్లాటతో అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైతదన్న రీతిలో తప్పుడు ప్రచారం చేయడం అనేది బీజీపీకి అలవాటుగా మారిందన్నారు. దీనిని ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ అధ్యక్ష్యలు బాధ్యత తీసుకుని, యువతకు, ప్రజలకు తెలియజేయాలని కోరారు.