అధికారుల నిర్లక్ష్యం.. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజ్
రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ఖర్చు చేసి భగీరథ పైప్‌లైన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్లు అందించడం కోసం ఎంతగానో కృషి చేస్తుంది.
దిశ, అల్లాదుర్గం: రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ఖర్చు చేసి భగీరథ పైప్‌లైన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్లు అందించడం కోసం ఎంతగానో కృషి చేస్తుంది. కానీ కిందిస్థాయి అధికారులు మాత్రం వాటిని ఆచరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నరని చెప్పవచ్చు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం 161 జాతీయ రహదారికి నుంచి ముప్పారం గ్రామానికి భగీరథ నీళ్లు సరఫరా అయ్యే పైప్‌లైన్ బుధవారం తెల్లవారుజామున లీక్ అయ్యి భగీరథ నీళ్లు వృధాగా పారుతున్నాయి. దీంతో ముప్పారం గ్రామస్తులకు గత మూడు రోజులుగా నీళ్లు రాక గోసలు పడుతున్నారు.
మంచినీళ్లు కాస్త కలుషితమై మరుగు నీరుగా మారుతుంది. నీళ్లు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులు ఆదేశించినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పక్షం రోజులు గడవక ముందే పైప్ లైన్ లీకేజీలు అంటూ నీళ్ళకు అంతరాయం కలిగిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీక్ అయిన మంచినీటి పైప్ లైన్‌ను మరమ్మతులు చేపట్టి గ్రామాల ప్రజలకు మంచినీళ్లను అందించాలని కోరారు.