‘హరీశ్’ నజర్.. జహీరాబాద్‌లో కాంగ్రెస్ బేజార్..
అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ వీక్ గా ఉన్న జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పై స్వయంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడ బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ కూడా బలంగానే
దిశ, సంగారెడ్డి బ్యూరో : అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ వీక్ గా ఉన్న జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పై స్వయంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడ బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ కూడా బలంగానే ఉన్నది. ఇక్కడ పార్టీలో నాయకత్వం లోపం, ఇతర కారణాలున్నాయని గుర్తించి మంత్రి హరీశ్‌రావు పార్టీ బలోపేతానికి ఆయనే రంగంలోకి దిగారు. ట్రబుల్ షూటర్.. అలా నజర్ పెట్టారో లేదో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనాయకులు వరుస పట్టి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీ ఒక్కదెబ్బకే ఖాళీ అయ్యే పరిస్థితికి చేరింది. స్థానికంగా కాంగ్రెస్ కు పెద్దదిక్కైన పీసీసీ సభ్యుడు వై.నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అదే బాటలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్ లోకి క్యూకడుతున్నారు. వీరే కాకుండా సామాజిక ఉద్యమకారుడు డిల్లీ వసంత్, ఇతర నాయకులు చేరిపోవడంతో బీఆర్ఎస్ తో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. చేరికల పరంపరతో జహీరాబాద్ లో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ కు షాకిచ్చిన వైనరోత్తం
జహీరాబాద్ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 2018లో అమె ఓటమి చెందారు. ఆ తరువాత నుంచి అనారోగ్య సమస్యలు ఇతర కారణాలతో ఆమె హైదరాబాద్ నుంచి జహీరాబాద్ కు రావడం తగ్గించుకున్నారు. ఎప్పుడో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే వచ్చి వెళుతున్నారు. బీఆర్ఎస్ హవా కొనసాగుతున్న సందర్భంలోనూ గీతారెడ్డి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథయంలోనే ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ బలంగానే ఉన్నది. అయితే గీతారెడ్డి స్థానికంగా లేకపోయినప్పటికీ ఆ పార్టీకి పెద్దదిక్కుగా వై.నరోత్తం ఉండేవారు. పీసీసీ సభ్యుడైన ఆయన పార్టీ కోసమే పనిచేస్తూ ఉండేవారు. అయితే పార్టీ కోసం ఎంతకష్టడినా సీనియర్ అయిన గీతారెడ్డిని కాదని తనకు అవకాశాలు ఇవ్వరని గుర్తించిన ఆయన జూలై 6న ఎవరూ ఊహించని విదంగా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నరోత్తం చేరికతో పార్టీ క్యాడర్ అంతే నారాజ్ అయిపోయింది. అలాంటి వారికే గుర్తింపు లేకుండా మన పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర క్యాడర్ కూడా ఒక్కక్కరుగా నరోత్తం బాటలోని బీఆర్ఎస్ లోకి చేరిపోతున్నారు. నరోత్తం చేరిక కాంగ్రెస్ కు పెద్ద షాక్ గా చెప్పకోవచ్చు.
కాంగ్రెస్ క్యాడర్, ఇతరులు కూడా..
జహీరాబాద్ బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. వైనరోత్తం చేరిన తరువాత ఇతర వర్గాలు చేరిపోతున్నాయి. జహీరాబాద్ కు చెందిన 22 ఏండ్లుగా సామాజిక ఉద్యమకారుడిగా పేరుపొందిన డిల్లీ వసంత్ ఈ నెల 11న మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిపోయారు. జహీరాబాద్ లోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా అక్కడే వసంత్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వసంత్ చేరిక కూడా పార్టీకి పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. సామాజిక ఉద్యమాల నేపథ్యం ఉన్న ఆయన చేరికతో పార్టీలో కొత్త ఉత్సాహం నిండింది. ఇదిలా ఉండగా వీరిబాటలోనే జీర్లపల్లికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు ప్రవళిక ఈ నెల 23న మంతి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అమెతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికల పరంపర అలాగే కొనసాగుతున్నట్లుగా బుదవారం కూడా హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు సహక్షంలో ఆర్యకటిక సంఘం అధ్యక్షులు మెగులాజీ రాజుతో పాటు మూకుమ్మడిగా సభ్యులంతా బీఆర్ఎస్ లో చేరారు. ఇలాగే చేరికలు ఇంకా కొనసాగుతాయని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు దిశ ప్రతినిధితో తెలిపారు.
రంగంలోకి ట్రబుల్ షూటర్..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే జహీరాబాద్ లో బీఆర్ఎస్ కొంత వరకు బలహీనంగా ఉందనే చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మరణం, ఇతర కారణాలతో ఇక్కడ నాయకత్వ లోపం ఏర్పడింది. అందరిని కలుపుకుని పార్టీని బలోపేతం చేయడంలో స్థానిక నాయకత్వం విఫలమైందని మంత్రి హరీష్ రావు గుర్తించారు. ఈ క్రమంలోనే స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత నరోత్తం, సామాజిక ఉద్యమకారుడు డిల్లీ వసంత్, ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. స్యయంగా మంత్రి రోజువారిగా జహీరాబాద్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ వారికి దిశానిర్ధేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంలో జహీరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే స్థానిక నాయకత్వం విఫలం కావడంతోనే నేరుగా మంత్రి రంగంలోకి దిగి పార్టీని చక్కదిద్దుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.