Accident : ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆడ పిల్లలతో సహా తల్లి, బావ మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
దిశ, తూప్రాన్ : కూతురి పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరు పిల్లలతో కలిసి తన బావ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అనుకోని మృత్యు ఘటన ట్రాక్టర్ రూపంలో కబళించి వేయడంతో నాలుగు నిండు ప్రాణాలు బలి కావడంతో రహదారి నెత్తురోడింది. గ్రామస్తులు, సంబంధికులు తెలిపిన వివరాల ప్రకారం… మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామానికి చెందిన మన్నె,కుమార్ లావణ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు సంజన తన అమ్మమ్మ నివాసమైన వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ఉంటూ విద్యను అభ్యసిస్తుంది. శనివారం సంజన పుట్టినరోజు కావడంతో లావణ్య (35)రెండో కుమార్తె సహస్ర (10)చిన్న కూతురు శాన్వి (7) తో పిల్లలతో కలిసి తన తల్లి గారి ఇంటికి వెళ్ళుటకు సిద్ధమైంది. కాగా తన భర్త వ్యవసాయ పనుల్లో ఉండడంతో బావ (భర్త అన్న) మన్నె ఆంజనేయులు,(50) ద్విచక్ర వాహనంపై శభాష్ పల్లి చౌరస్తాపై దింపడానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో స్థానిక ప్రాణా ఫుడ్స్ సమీపంలో ఎదురుగా వస్తున్న అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ వేగంగా ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనికి కారణం రహదారి పై ధాన్యం కుప్పలు పోయడంతో ఒకవైపు నుండే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో సాయంత్రం వేళ చీకటిలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు గుర్తించలేక బలంగా ఢీ కొనడంతో పెను ప్రమాదం జరిగి ఇద్దరి చిన్నారులతో సహా రెండు పెద్ద ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. గ్రామస్థులు ఆందోళనకు దిగి ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి కుటుంబాలకు న్యాయం చేసే వరకు మృతదేహాలను తరలించమని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతో పోలీసులు గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.