Minister Uttam : ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
దిశ, సంగారెడ్డి : జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహన్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.
సన్నరకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రకటించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ధాన్యం శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు, క్యాలిపర్స్ ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన సమకూర్చాలన్నారు. తాలు, తప్ప పేరుతో రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలలో కోతలు అమలు చేయకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే కాంటా చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కొండలరావు, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.