40 రోజులు కాంగ్రెస్‌కు పనిచేద్దాం : కాటా శ్రీనివాస్ గౌడ్

40 రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వండి. ఆ తర్వాత ఐదేళ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుందామని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Update: 2023-10-20 15:52 GMT

దిశ, పటాన్ చెరు: 40 రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వండి. ఆ తర్వాత ఐదేళ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుందామని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదులనాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఆకాంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల కుటుంబ పాలనలో చిక్కి రోధిస్తుందన్నారు. ఒక వైపు నిరుద్యోగుల ఆత్మహత్యలు, మరోవైపు రైతులను కష్టపెడుతూ కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఆనాడు సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ప్రజానీకానికి న్యాయం చేయాలన్న తలంపుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కార్యకర్తలు అందరూ నవంబర్ 30వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఆరు గ్యారంటీలను, కాంగ్రెస్ పార్టీ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ చిలుకమర్రి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, వైస్ ప్రెసిడెంట్స్ జహీర్, మురళి, కౌన్సిలర్స్ రాజు గౌడ్, రాంసింగ్, జనరల్ సెక్రటరీ వడ్డె నరసింహ, సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, అమీన్ పూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి తో పాటు తూర్పు శ్రీను, అరుణ్ గౌడ్, నవారి శ్రీనివాస్ రెడ్డి, జావీద్, శ్రీను, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్, మధు, ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేఎస్‌జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News