నవ్వేలా నాణ్యతా.. పాత రాళ్లతో నిర్మాణాలు..!

ఇరుకు రోడ్డుకు నిధులు మంజూరు కోసం పట్టణ వాసులు ఏళ్లుగా ఎదురు చూశారు..

Update: 2024-07-07 02:37 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ఇరుకు రోడ్డుకు నిధులు మంజూరు కోసం పట్టణ వాసులు ఏళ్లుగా ఎదురు చూశారు. నిధులు మంజూరుతో నిర్మాణం చేపడుతుంటే సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ స్వాలాభ పేక్షతో పాత డ్రైనేజీ రాళ్లు, డస్ట్ పౌడర్ పైప్ లైన్ నిర్మాణం సాగుతున్నా సంబంధిత శాఖ మూగ పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది. నాసిరకం నిర్మాణంపై స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాణ్యత ప్రమాణాలు మాత్రం డొల్లగానే మారింది. మామూళ్ల మత్తులో నాణ్యతకు నీల్లోదిలారన్న విమర్శలు వస్తున్న సంబంధిత శాఖలో చలనం లేకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా నుంచి సర్ధన వెళ్లే ప్రధాన దారి ఇరుకుగా ఉండడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదే రోడ్డు పక్కన సినిమాక్స్ సినిమా ధియేటర్, దయారా, ముత్తాయి కోట సిద్దిరమేశ్వర స్వామి ఆలయం, కూచాద్రి వెంకటేశ్వర ఆలయానికి వేళ్లే దారితో పాటు కూచన్ పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్ పూర్, సర్థన, జక్కన్న పేట తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన దారి. నిత్యం వందలాది వాహనాలు, ప్రజలు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండడం మూలంగా అనేక సమస్యలు వస్తున్నాయి. రాందాస్ చౌరస్తా నుంచి పీట్లం చెరువు కట్ట వరకు ఉన్న 1.3 కిలో మీటర్ లో రోడ్డు నిర్మాణం చేబడితే ప్రయాణికుల సమస్య తీరుతుంది. ఏళ్లుగా స్థానికులు, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అప్పటి పాలకులకు విన్నవించగా గత అక్టోబర్ లో రూ 7.8 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో అండర్ గ్రౌడ్ డ్రైనేజీ, 50 ఫీట్ల సీసీ రోడ్డు, సింగిల్ డివైడర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు చేసేందుకు ననిత కన్స్ స్ట్రక్టన్ టెండర్ ద్వారా పొంది పనులు చేపట్టింది. పనులు మొదట ప్రారంభించి తరవాత నెల పాటు నిలిపివేసి మళ్లీ పనుల నిర్మాణం చేపట్టింది.

* పాత రాళ్లు, డస్ట్ పౌడర్..!

దాయార, రాందాస్ చౌరస్తా రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణంతో పాటు మ్యాన్​హోల్​ నిర్మాణం, డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్నారు. ప్రధాన రోడ్డుపై ఉన్న బ్రిడ్జి కూల్చి వేసి అందులో ఉన్న పాత రాళ్లనే నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. నిబంధన ప్రకారం డ్రైనేజీ నిర్మాణం పనుల్లో సిమెంట్ లో ఇసుక కలిపి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా డస్ట్ పౌడర్ తోనే నిర్మాణం పనులు చేస్తున్నా అధికారులు కాంట్రాక్టర్ కే వత్తాసు పాడడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్న పనుల్లో నాణ్యత లేకుంటే చిందులేసే అధికారులు కాంట్రాక్టర్ బహిరంగంగా పనులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు రోడ్డు అంతా ఇరుకుగా ఉంటుంది. ఒక వాహనం వెళితే మరో వాహనం ఆగాల్సిన పరిస్థితి.

చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, ఎమ్మెల్సీ, అప్పటి ఎమ్మెల్యేల కృషి ఫలితంగా 7.8 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో రోడ్డు సమస్య తీరుతుందని ఆశించిన ప్రజలకు నాసిరకం నిర్మాణంతో పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం ఉందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత వినియోగించిన రాళ్లు, డస్ట్ పౌడర్ నిర్మాణంలో వాడితే నాణ్యతగా ఉండదని స్థానిక యువకులు అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య లోపాయికారి ఒప్పందం మూలంగానే నాసిరకంగా పనులు జరిగినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల జరిగే ప్రాంతంలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కోట్ల రూపాయల పనులు స్థానికంగా జరుగుతున్న సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేని స్థానికులు వాపోతున్నారు. కోట్ల సర్కారు సొమ్ముతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా జిల్లా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి నాసిరకం నిర్మాణం పనులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పాత రాళ్ళు నిర్మాణంలో వాడొచ్చు..

రియాజ్, అర్ అండ్ బీఏఈ, మెదక్

డ్రైనేజీ, ఇతర నిర్మాణాల్లో పాత రాళ్లు వాడవచ్చని ఏఈ రియాజ్ అన్నారు. పనుల్లో కొన్ని చోట్ల పాత రాళ్లు ఉన్న మాట నిజమేనని, పాతవి వాడవచ్చని చెప్పారు. రోడ్డు డ్రైనేజీ నిర్మాణం పనుల్లో నాసిరకం లేదని, నాణ్యతతో నిర్మాణం సాగుతుందని వివరణ ఇచ్చారు.


Similar News