ఎర్రవల్లిలో నవగ్రహ మహా యాగం.. పాల్గొన్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో

Update: 2024-09-06 16:19 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నుంచి నవగ్రహ మహా యాగం చేపట్టారు. పట్టువస్త్రాల్లో తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్‌ యాగం ప్రారంభించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రతువులో ఆయన కుమార్తె కవిత కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ యాగం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది తెలియలేదు. కుటుంబసభ్యులు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ యాగంలో పాల్గొన్నారు. అయితే యుగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు.

ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో..

శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత అనేక గండాలు చుట్టుముట్టాయి. కిందపడి తుంటి ఎముక కు చికిత్స పొందడం.. కుమార్తె కవిత అరెస్టవడం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి రాజకీయాలకు కొంత దూరమైన కేసీఆర్‌ తాజాగా యాగం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

గతంలోనూ పలు యాగాలు...

మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు యాగాలు చేపడుతుంటారు. గతంలో 2015 లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీ యాగం చేశారు. 2018 లో మరో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు ఎర్రవెల్లి ఫాం హౌస్ లో రాజ శ్యామల యాగం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు రోజుల పాటు రాజ శ్యామల యాగం చేశారు.


Similar News