వక్ఫ్ బిల్లు సవరణతో అందరికి న్యాయం.. డీకే.అరుణ

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు - 2024తో అన్ని మతాలు, వర్గాల వారందరికి న్యాయం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ, వక్ఫ్ బోర్డు జేపీసీ సభ్యులు డీకే అరుణ అన్నారు.

Update: 2024-09-11 16:49 GMT

దిశ, జహీరాబాద్ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు - 2024తో అన్ని మతాలు, వర్గాల వారందరికి న్యాయం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ, వక్ఫ్ బోర్డు జేపీసీ సభ్యులు డీకే అరుణ అన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ భూ బాధిత రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆమె హాజరై రైతుల అభిప్రాయాలను ఆలకించి, వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ మైనార్టీ ఆస్తుల పట్ల కొన్ని వర్గాలు చేస్తున్న విషప్రచారాన్ని మైనారిటీలు నమ్మొద్దన్నారు. పరంపరంగా భూములను సాగు చేస్తూ, క్రయవిక్రయాలు జరుపుతూ, సంపూర్ణంగా భూ హక్కులు అనుభవిస్తున్న రైతులకు ఎలాంటి భయం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ బిల్లుకు ఇదివరకు కూడా సవరణలు జరిగాయని గుర్తు చేశారు. వినతి పత్రాలను పరిగణలోకి తీసుకొని ఢిల్లీలో నిర్వహించే జేపీసీ ముందు ఉంచుతానని చెప్పారు. పారంపర్యంగా అనుభవిస్తున్న భూములను కూడా అమాంతంగా వక్ఫ్ గా పేర్కొనడం రైతుల్లో ఆందోళనకు గురిచేస్తుందన్నారు.

రైతుల జీవితాల పై ప్రభావం చూపుతున్న ఈ బిల్లులో చేపట్టే సవరణల ద్వారా అన్ని వర్గాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 80 వేల ఎకరాలు వక్ఫ్ భూములు పేర్కొన్నారని, అందులో 77 వేల ఎకరాలు సాగుభూములేనని, రైతులు సాగు చేస్తున్నారన్నారు. కొందరు గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారాలు మైనార్టీ వర్గాలు నమ్మరాదన్నారు. ప్రతి ఒక్క మతం, వర్గాలకు సవరణ బిల్లుతో న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ బిల్లులో చేపట్టే సవరణలతో సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 25 కోట్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందంటూ ఓ వర్గం పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారాన్ని నమ్మరాదన్నారు. చాలామంది రైతులు, న్యాయ నిపుణులు తనను కలిశారని ట్రిబ్యునల్ వల్ల ఎలాంటి న్యాయం జరగదని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి సవరణ బిల్లు వల్ల న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వక్ఫ్ సమస్యల్లో ఇరుక్కున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతుల జీవితాలతో చెలగాటంగా ఇది మారిందన్నారు. రైతుల పిల్లల పెండ్లిల్లు, వైద్య సమస్యలు, భూముల క్రయవిక్రయాలు జరగడం లేదని, దీంతో భవిష్యత్తు పై వారిలో భయం నెలకొందన్నారు. బాధిత రైతులందరికీ జేపీసీ వరంలాంటిదని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి భయం వద్దన్నారు. ఈ ప్రాంతంలో 13 వేల ఎకరాల భూములు వక్ఫ్ గా పేర్కొన్నారని, ఆయా భూముల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా జేపీసీ ముందు రైతులు తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

రైతు హక్కుల సాధన సమితి కన్వీనర్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, నాయకులు సీపీఎం, రైతు సంఘం నేత బి.రాంచందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎం. జైపాల్ రెడ్డి, వీరారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, సామెల్, అభినవ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూములను వక్ఫ్ గా చిత్రీకరించినట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఎదురవుతున్న ఇబ్బందులు రైతులకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఈ సమస్యకు సవరణ బిల్లులో చక్కటి సమాధానం చూపాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.


Similar News