శశి రీ ఎంట్రీ.. మారనున్న మెదక్ రాజకీయ ముఖ చిత్రం!

మెదక్ నియోజకవర్గంపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో పార్టీ ఉంది.

Update: 2023-05-27 03:35 GMT

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచింది. అధికారమే ధ్యేయంగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. కోవర్టుల తోక కట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. మెదక్‌లో కోవర్ట్ నేతలపై కన్నేసిన అధిష్టానం. వారికి చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్నాళ్లు శశిధర్ రెడ్డిని పార్టీలోకి రాకుండా అడ్డుకున్న కోవర్టును కాంగ్రెస్ ​గుర్తించింది. అతన్ని పొమ్మన లేక పొగబెట్టెందుకు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇన్నాళ్లు టికెట్ ఆశించిన మ్యాడమ్ ఆశలకు అధిష్టానం నీళ్లు చల్లిందని పార్టీలో చర్చ సాగుతోంది.

దిశ, మెదక్ ​ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో పార్టీ ఉంది. కానీ విజయం సాధించే సత్తా గల నేత ఎవరన్నదే ప్రశ్నార్థకం. డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి, మ్యాడమ్ బాలకృష్ణతో పాటు మరికొంత మంది ఆశావహుల పేర్లు వినిపించిన అందులో ప్రజా బలం ఉన్న నేత లేడన్న అభిప్రాయం కార్యకర్తలలో వ్యక్తం అవుతుంది. ఇటీవల కాలంగా కంటా రెడ్డి కొంత ఉత్సాహంతో ముందుకు వెళుతున్న మ్యాడమ్ బాల కృష్ణ అడ్డంకులు సృష్టిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్​ మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా వివాదానికి కారణమైంది.

ఈ విషయమై అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడం.. చీవాట్లు పెట్టిన విషయం కూడా తెలిసిందే. గతంలో పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైతం ఫిర్యాదు చేశారు. మ్యాడమ్ బాల కృష్ణ వల్ల పార్టీకి వచ్చే పేరు ఏమి లేదనీ, అంతా వ్యక్తి గత పేరుకే ప్రచారం చేసుకుంటున్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న పలు పనులపై కూడా అనుమానం వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీకి కోవర్ట్‌గా పని చేస్తున్నడన్న ఆరోపణపై విచారించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల సమయం సస్పెన్షన్ వల్ల నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని పక్కన పెట్టేందుకే శశిధర్ రెడ్డికి పార్టీ కండువా కప్పే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

శశిధర్ రెడ్డిని రంగంలోకి దించింది అందుకేనా..!?

మెదక్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న గెలుపు ఎండ మావిగా మారుతుంది. పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు నియోజక వర్గంలో ఉన్న బలమైన నేత లేదన్న విమర్శలున్నాయి. ఈ సారి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేయాలంటే పార్టీ కోసం కష్టపడే నేత కావాలి. మ్యాడమ్ బాల కృష్ణ వల్ల పార్టీకి జరిగిన లాభం కంటే నష్టమే అధికంగా ఉందని అధిష్టానం గ్రహించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి శశిధర్ రెడ్డి రాకుండా అడ్డుకున్న నేతల్లో మ్యాడమ్ కూడా ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో మ్యాడమ్‌కు చెక్ పెట్టాలంటే శశిధర్ రెడ్డి వస్తేనే సాధ్యం అన్నది గ్రహించిన అధిష్టానం ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇద్దరి మధ్యే టికెట్ పోటీ...?

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి రావడంతో పార్టీ బలం పెరగడంతో పాటు టికెట్ పోటీ కూడా ఇద్దరి మధ్యనే ఉండే అవకాశం ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కాంటారెడ్డి తిరుపతిరెడ్డి కొంతకాలంగా ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు. కానీ అదే సమయంలో పైరవీ ద్వారా టికెట్ పొందేందుకు సైతం ఒక నేత ప్రయత్నిస్తున్న టికెట్ ఎవరికీ వస్తుందన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. కానీ శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రావడంతో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ పోటీలో ఉండే అవకాశం ఉంది. శశిధర్ రెడ్డి కుటుంబం కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంది.

తండ్రి స్వర్గీయ నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో శశిధర్ రెడ్డి సోదరులు ఉపేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం కారణంగా ఈసారి టికెట్ ఎవరికి వస్తుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. చాలామంది టికెట్ ఆశిస్తున్న ప్రధానంగా టికెట్ పోటీ మాత్రం కంటారెడ్డి తిరుపతిరెడ్డి, శశిధర్ రెడ్డిల మధ్య ఉండే అవకాశం ఉంది. మెదక్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంతో ఆశ పెట్టుకున్న మేడం బాలకృష్ణకు నిరాశ ఎదురయ్యే అవకాశం శశిధర్ రెడ్డి పార్టీలోకి రాకతో కనిపిస్తుంది.

Read more:

శశిధర్ రెడ్డి జంప్.. ఆ రెండు పార్టీలు అలర్ట్!

Tags:    

Similar News